
మన తెలంగాణ/హైదరాబాద్‌ః కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఏ అధికారంలో ఉన్నప్పుడు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భారీ కుంభకోణం జరిగిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఆరోపించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును ‘విబి జి రామ్ జి’గా మార్పు చేయడంపై వస్తున్న విమర్శల నేపథ్యంలో ఆదివారం నాంపల్లిలోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటైన వర్క్ షాప్‌కు రాంచందర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ యుపిఏ హయాంలో జాతీయ గ్రామీణ హామీ పథకంలో అనేక కుంభకోణాలు జరిగాయని విమర్శించారు.
ఉత్తర్ ప్రదేశ్‌లో (2011) నకిలీ జాబ్ కార్డులు, కల్పిత పనులు, లేనిపోని వ్యక్తులకు చెల్లింపుల ద్వారా పది వేల కోట్ల రూపాయలకు పైగా దుర్వినియోగం జరిగిందని ఆయన ఆరోపించారు. అదేవిధంగా ఒడిశా సంబల్పూర్ జిల్లాలో (2012) మరణించిన వారికి, పని చేయని వారికి, పెన్షనర్లకు వేతనాలు చూపించి, నకిలీ పని దినాలు, డూప్లికేట్ బిల్లుల వంటి అవకతవకలు జరిగాయని ఆయన ఉదహరించారు. మహాత్మా గాంధీ పేరు తొలగించారని ఆందోళన వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ నాయకులు శంషాబాద్ విమానాశ్రయానికి మహాత్మా గాంధీ పేరు ఎందుకు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు. ఆ పథకాన్ని కేంద్రం తొలగించలేదని, వికసిత్ భారత్‌గా పేరు మార్పు చేసిందని, పైగా వంద రోజుల పని దినాల నుంచి 125 రోజులకు పెంచడం జరిగిందని రాంచందర్ రావు తెలిపారు.




