
ఎలాన్ మస్క్‌కు చెందిన వివాదాస్పద ఎఐ చాట్‌బాట్ గ్రోక్‌ను ఇండోనేసియాలో నిషేధించారు. డీప్‌ఫేక్ అశ్లీల చిత్రాల ప్రసారానికి దిగుతున్నందున మస్క్ ఎక్స్ సోషల్ మీడియా అనుబంధ వేదికపై ఈ దేశం కఠిన చర్యకు దిగింది. మానవ హక్కుల ఉల్లంఘనలు, గౌరవ మర్యాదల అతిక్రమణలు, పౌరుల భద్రతకు భంగకరం వంటి అంశాలపై గ్రోక్ చాట్‌బాట్‌పై నిషేధం విధించిన తొలి దేశంగా ఇప్పుడు ఇండోనేసియా నిలిచింది. నిషేధ ఉత్తర్వులను శనివారం దేశ కమ్యూనికేషన్లు, డిజిటల్ వ్యవహారాల మంత్రిత్వశాఖ తమ ప్రకటనలో తెలిపింది. దేశ మహిళలు, యువతరం, బాలలను, పౌరులను ఈ అవలక్షణ కృత్రిమ మేధ నుంచి రక్షించాల్సిన బాధ్యత తీసుకుంటున్నామని, అందుకే దీనిపై నిషేధం విధించామని వివరించారు. తిరిగి ఆదేశాలు వెలువడే వరకూ ఈ నిషేధం అమలులో ఉంటుందని సంబంధిత మంత్రి మెయూట్యా హఫీద్ ప్రకటన వెలువరించారు. ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న ఈ దేశంలో మస్క్ వేదికకు షాక్ తగిలింది. భారతదేశం కూడా గ్రోక్ అశ్లీల కంటెంట్ కట్టడికి ఉత్తర్వులు వెలువరించింది.




