
ప్రధాని నరేంద్ర మోడీ శనివారం గుజరాత్‌లోని ప్రఖ్యాత సోమనాథ్ ఆలయాన్ని సందర్శించుకున్నారు. ఈ ప్రాచీన ఆలయంపై పరాయి రాజుల దాడులు జరిగి వేయి సంవత్సరాలు పూర్తయిన దశలో జరిగిన సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆక్రమణదారుల దాడులకు తట్టుకుని నిలిచి, భారతీయ ఆత్మస్థయిర్యానికి ప్రతీకగా ఈ సోమనాథ దేవాలయం సగర్వంగా నిలిచిందని ఈ సందర్భంగా ప్రధాని తెలిపారు. ఇక్కడికి చేరుకున్న ప్రధాని ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. ఆహుతులతో కలిసి తాను కూడా ఓంకార మంత్రం పఠించారు. ధ్యానంలో నిమగ్నం అయ్యారు. ప్రత్యేక ఉత్సవాల దశలో ఆలయానికి రంగురంగుల విద్యుద్దీపాల అలంకరణ ప్రత్యేకతగా మారింది. 1026లో తొలుత అప్పటి మొఘలాయి రాజు మహమ్మద్ గజ్ని సేనలు ఈ ఆలయంపై దాడికి దిగాయి. ధ్వంసానికి యత్నించాయి. తరువాత పలుసార్లు పరాయిల దాడులు జరిగాయి.
తరువాతి క్రమంలో దేశ స్వాతంత్య్రం తరువాత ఆలయ పునర్నిర్మాణం పునరుద్ధరణ జరిగింది. ఇప్పుడు కూడా ఈ ఆలయం మన ఆత్మవిశ్వాసానికి ప్రతీక అయిందని ప్రధాని మోడీ ఆలయ సందర్శనల దశలో పేర్కొన్నారు. ఆలయానికి వచ్చిన ప్రధాని ఇక్కడి ట్రస్ట్ ఛైర్మన్ కూడా కావడంతో ఆయనకు ఆలయ కమిటీ ప్రత్యేక అతిధి మర్యాదలు చేశారు. అర్చకులు నుదుటిన విభూతితో ఆశీర్వచనాలు తెలిపారు. శనివారం ఇక్కడ ప్రత్యేక రీతిలో ఆకర్షణీయమైన డ్రోన్ ప్రదర్శనలో ఆలయ విశిష్ట ఘట్టాలను చారిత్రక విషయాలను గుర్తు చేస్తూ కనువిందు చేశారు. శివుడి భారీ ప్రతిమను ప్రదర్శించారు. దాదాపుగా 3వేల డ్రోన్లతో భారీ స్థాయిలో ప్రదర్శన జరిగింది. కార్యక్రమానికి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘవి ఇతర ప్రముఖులు హాజరయ్యారు. సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ ఈ నెల 8న ఆరంభం అయింది . 11న ముగుస్తుంది.




