
కౌలాలంపుర్: భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ప్రతిష్ఠాత్మకమైన మలేసియా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ పోరులో జపాన్ క్రీడాకారిణి అకానే యమగుచి గాయంతో అర్ధాంతరంగా వైదొలిగింది. అప్పటికే తొలి గేమ్‌ను సింధు సొంతం చేసుకుంది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన సింధు 21-11 తేడాతో అలవోకగా సెట్‌ను దక్కించుకుంది. రెండో సెట్ ఆరంభానికి ముందు గాయం తిరగబడడంతో యమగుచి మ్యాచ్ నుంచి తప్పుకుంది. దీంతో సింధు సెమీ ఫైనల్‌కు చేరుకుంది. సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ బ్యాడ్మింటన్ బరిలోకి దిగిన సింధు తొలి టోర్నమెంట్‌లోనే సెమీస్‌కు చేరుకుని సత్తా చాటింది. మరోవైపు పురుషుల డబుల్స్‌లో భారత్‌కు చెందిన సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ క్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టింది.




