
ఓ ఇంటిలో చోరీకి వెళ్లిన దొంగ , ఎగ్జాస్ట్ ఫ్యాన్ కన్నంలో ఇరుక్కుపోయి పోలీసులకు దొరికిపోయాడు. రాజస్థాన్ లోని కోటాలో చోటు చేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది. కోటాలో ఎవరూ లేని ఇంటిలో చోరీ చేయడానికి పథకం వేసుకున్న ఓ దొంగ ఎగ్జాస్ట్ ఫ్యాన్ కన్నంలో నుంచి ఇంట్లోకి వెళ్లడానికి ప్రయత్నించాడు. అయితే కన్నంలో సగం దూరిన తరువాత మధ్యలో ఇరుక్కుపోయాడు. లోపలి నుంచి బయటకు రావడానికి ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాకపోవడంతో అందులోనే వేలాడుతూ ఉన్నాడు. రాత్రి ఒంటిగంట సమయంలో ఇంటికి వచ్చిన యజమాని వంటగదిలోని ఎగ్జాస్ట్ ఫ్యాన్ కన్నంలో ఇరుక్కున్న దొంగను గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దాదాపు గంటపాటు శ్రమించి దొంగను కన్నం నుంచి బయటకు తీశారు. అతడిని అదుపు లోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఇదిలా ఉండగా, చోరీ చేయడానికి వచ్చిన దొంగ ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు పోలీస్ స్టిక్కర్ ఉన్న కారులో వచ్చినట్టు తెలిపారు. ఈ సంఘటన జనవరి 3న జరిగింది.




