
న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. అస్సాంలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎంపి, ఆ పార్టీ అగ్రనాయకురాలైన ప్రియాంక గాంధీకి కీలక బాధ్యతలు అప్పగించింది. అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పర్యవేక్షించే స్క్రీనింగ్ కమిటీ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. ఈ మేరకు ఆదివారంనాడు ఎఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ ఉత్తర్వులు జారీచేశారు. ప్రియాంక కమిటీలో లోక్‌సభ సభ్యులు ఇమ్రాన్ మసూద్, సప్తగిరి శంకర్, సిరివెల్ల ప్రసాద్‌లు సభ్యులుగా ఉన్నారు.
ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఖరారు, ఎన్నికల ముందు జరగాల్సిన అంతర్గత సంప్రదింపులు వంటి వాటిని ఈ కమిటీ నిర్వహించనుంది. అస్సాంతో పాటు 2026లో ఎన్నికలు జరగనున్న మరో మూడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతానికీ ఛైర్మన్లను నియంచారు. పశ్చిమ బెంగాల్ స్క్రీనింగ్ కమిటీ అధ్యక్షుడిగా ఆ పార్టీ సీనియర్ నేత బీకే.హరిప్రసాద్, కేరళ బాధ్యతలను రాజ్యసభ మాజీ సభ్యులు మధుసూదన్ మిస్త్రీ, తమిళనాడు, పుదుచ్చేరిలకు ఛత్తీస్‌గఢ్ మాజీ ఉప ముఖ్యమంత్రి త్రిభునేశ్వర్, స్వరన్ సింగ్ దేవ్‌లకు అప్పగిస్తూ పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది.




