
సోయా రంగు మారితే కొనుగోలు ఆపుతారా? అని మాజీ మంత్రి జోగు రామన్న ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు రైతులకు న్యాయం చేయలేక తీరొక్క మాట మార్చుతూ తప్పించుకు తిరుకుతున్నారని మండిపడ్డారు. తక్షణం రైతులు పండించిన పంటలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బిఆర్‌ఎస్ శ్రేణులతో కలిసి శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా, బేల=జైనధ్ జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రంగుమారిన సోయాలో నాణ్యత తగ్గకున్నా అధికారులు మోసపూరిత మాటలతో రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. శాస్త్రవేత్తలతో పరిశోధనలు చేసి గ్రేడ్ల వారీగా సోయాను కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. జిల్లాలోని రైతులు పండించిన పంటలు మహారాష్ట్రలో గ్రేడ్ వన్‌గా కొనుగోలు చేస్తుంటే ఆదిలాబాద్‌లో పంటలను
తిరస్కరించడం రైతుల ఆత్మహత్యను ప్రోత్సహించడం కాదా అని ప్రశ్నించారు. సిఎం రేవంత్‌రెడ్డి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి జూపల్లి ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వచ్చి వెళ్లినా రైతులను పట్టించుకోకపోవడంతో ఎంతటి నిర్లక్ష్యమో స్పష్టమవుతుందని అన్నారు. తడిసిన ధాన్యం సాకుతో రైతును ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. అధికారులు రైతుల పక్షాన నిలవకుండా ప్రభుత్వానికి మద్దతుగా దారుగా నిలవడం సిగ్గుమాలిన చర్య అని నిలదీశారు. పంటలను కొనుగోలు చేసే వరకు తమ పార్టీ రైతుల పక్షాన ఆందోళన కార్యక్రమాలను కొనసాగుతూనే ఉంటాయని స్పష్టం చేశారు. రైతులకు న్యాయం జరుగకుంటే ఎంపి, ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతులు మనోహర్, యాసం నర్సింగరావు, మార్చెట్టి గోవర్ధన్, ప్రమోద్‌రెడ్డి, సంతోష్, బట్టు సతీష్, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.




