
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వాపురం మండల పరిధిలోని మొండికుంట గ్రామం శివారు పాలవాగు వద్ద శుక్రవారం ఉదయం ఒక ప్రైవేటు కళాశాల బస్సు బోల్తా పడింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మణుగూరు-కొత్తగూడెం ప్రధాన రహదారిపై ప్రయాణిస్తున్న కెఎల్‌ఆర్ విద్యాసంస్థలకు చెందిన కాలేజీ బస్సు మొండికుంట అటవీ ప్రాంతంలోకి వచ్చే సరికి విపరీతంగా పొగ మంచు పడుతోంది. ఆ సమయంలో ఎదురుగా అతివేగంగా వచ్చిన లారీని తప్పించడానికి బస్సు డ్రైవర్ సడన్‌గా స్టీరింగ్ తిప్పడంతో ఒక పక్కకు ఒరిగి పడిపోయింది. ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో సుమారు 50 మంది విద్యార్థులు ఉండగా, వీరిలో పలువురికి గాయాలయ్యాయి.
ఒక విద్యార్థినికి చేయి తెగిపోయి తీవ్ర రక్తస్రావం అయింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, ఆ సమయంలో రోడ్డుపై వెళ్లే పలువురు వాహనదారులు సంఘటనా స్ధలానికి చేరుకుని గాయపడిన క్షతగాత్రులకు ప్రథమచికిత్స అందించారు. తీవ్రంగా గాయపడిన విద్యార్థులను అంబులెన్స్‌ల ద్వారా భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, ప్రమాద సమాచారం తెలుసుకున్న తహసీల్దార్ మణిథర్, సిఐ అశోక్‌రెడ్డి, మణుగూరు డిఎస్‌పి రవీందర్‌రెడ్డి పోలీస్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యల అనంతరం బస్సు ప్రమాదానికి గల కారణాలపై విచారణ ప్రారంభించారు. క్షతగాత్రుల పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.




