
పామ్‌బీచ్ (అమెరికా): రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే ప్రయత్నాల్లో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. శాంతి ఒప్పందం కుదుర్చుకునేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పూర్తి సుముఖంగా ఉన్నారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. పామ్‌బీచ్ లోని ట్రంప్ నివాసమైన “ మార్ ఎ లాగో” లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆదివారం భేటీ అయ్యారు. యుద్ధం ముగింపు కోసం ప్రతిపాదించిన 20 సూత్రాల ప్రణాళికపై ఈ చర్చలు సాగాయి. ఈచర్చలు సంక్లిష్టమై, విఫలమై, కొన్నేళ్లుగా యుద్ధం కొనసాగుతోందన్నారు. అంతకు ముందు రష్యాఅధ్యక్షుడు పుతిన్‌తో ట్రంప్ ఫోన్‌లో రెండున్నర గంటల సేపు మాట్లాడిన తరువాత ట్రంప్ ఈ ప్రకటన చేయడం గమనార్హం.
పుతిన్‌తో మాట్లాడేటప్పుడు ఉక్రెయిన్, ఐరోపా సంఘం చేసిన ప్రతిపాదనలను ఆయనతో చర్చించారు. పుతిన్‌తో తన సంభాషణ ఫలవంతంగా సాగిందని ట్రంప్ వెల్లడించారు. తాజా చర్చల కోసం జెలెన్‌స్కీ అమెరికాకు బయలుదేరినప్పటికీ ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి దాడులు చేసినా, పుతిన్ ఇంకా శాంతిని కోరుకుంటున్నారని ట్రంప్ వెల్లడించారు. రష్యా తన అధీనంలో ఉక్రెయిన్‌ను కొనసాగించడం, భవిష్యత్తులో ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేయబోదన్న దానిపై భద్రతాపరమైన గ్యారంటీలు, తదితర సమస్యలు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయి. చర్చల తరువాత ఐరోపా నాయకులను ఐరోపా కమిషన్ అధ్యక్షుడు ఉర్సులా వాన్ డెర్ లెయెన్, ఫిన్‌లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ పోలెండ్ నాయకులను ఆహ్వానించారు.
ఐరోపా నేతలకు ఆతిధ్యం ఇవ్వడానికి ట్రంప్ అంగీకరించారని బహుశా వైట్‌హౌస్‌లోనే జనవరిలో ఈ భేటీ జరగవచ్చని జెలెన్‌స్కీ వెల్లడించారు. శాంతికి ఉక్రెయిన్ సిద్ధంగా ఉందన్నారు. మరోసారి పుతిన్‌కు చర్చలకు ఆహ్వానిస్తానని ట్రంప్ వెల్లడించారు. అంతకు ముందు ఐరోపా సంఘం , నాటో లోని పలు మిత్రదేశాల నేతలతో జెలెన్‌స్కీ, కెనడా నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో కీలక చర్చలు జరిపారు. ఉక్రెయిన్ అనుసరిస్తున్న దౌత్య విధానాలను వారికి వివరించారు.




