
పబ్బులపై అకస్మిక దాడులు
క్విక్‌ఎరీనా పబ్‌లో ఎనిమిది మందికి పాజిటీవ్
మన తెలంగాణ/హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకల వేళ రాష్ట్ర ఈగల్ టీం దూకుడుగా వ్యవహరిస్తోంది. ప్రధానంగా హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకలపై దృష్టి సారించింది. డ్రగ్స్, ఇతర మాదక ద్రవ్యాలు కట్టడి చేసేందుకు అకస్మిక తనిఖీ చేపట్టాలని నిర్ణయించుంకుంది. దీనిలో భాగంగా ఆదివారం హైదరాబాద్‌లోని పలు పబ్‌లపై ఈగల్ టీం దాడులు నిర్వహించింది. ఈగల్ టీం, సైబరాబాద్ పోలీసులు సంయుక్తంగా కొండాపూర్‌లోని క్విక్ ఎరీనా పబ్‌పై అకస్మిక దాడులు చేపట్టి అక్కడ ఉన్న వారికి పరీక్షలు నిర్వహించారు. ఈ దాడుల్లో మెత్తం 14 మందికి అక్కడిక్కడే ర్యాపిడ్ కిట్‌లతో పరీక్షలు నిర్వహించగా ఎనిమిది మందికి పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. మరో ఎనిమిది మందికి పరీక్షలు నిర్వహించేందుకు యత్నించగా తాము డగ్స్ తీసుకున్నట్లు ఒప్పుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పరీక్షల్లో నిందితులు కొకైన్, గంజాయి, ఓపిఎం, టిహెచ్‌సి వినియోగించాలరని పేర్కొన్నారు. ఈ దాడుల్లో ఆరు ఎన్డీపి బాటిళ్లు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. దాడుల అనంతరం ఈగల్ టీం నిందితులపై కేసు నమోదు చేసి క్విక్‌ఎరీనా పబ్‌కు నోటీసులు అందచేసింది.




