
వాషింగ్టన్ : నోబెల్‌ను ముద్దాడి మురిసిపోదామనుకున్న డొనాల్డ్ ట్రంప్ ఆశలు ఆవిరయ్యాయి. అమెరికా అధ్యక్షుడిగా పదవిని చేపట్టిన నాటి నుంచి ప్రచారం చేసుకుంటూ బెదిరింపులకు దిగుతూ చేసిన ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. ఎనిమిది యుద్ధాలు ఆపానని సోషల్ మీడియాలో ఢంకా బజాయించుకొన్నా… పలుదేశాలు ఆయనకు మద్దతు తెలిపినా, నోబెల్ కమిటీ మాత్రం పట్టించుకోలేదు.
అధ్యక్షుడు అయినప్పటి నుంచి ఆరాట పడినా…
ఫిబ్రవరిలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో ట్రంప్ మాట్లాడుతూ “వారు నాకు నోబెల్ బహుమతి ఇవ్వరు. నేను అర్హుడినైనా నాకు ఎప్పటికీ ఇవ్వరు” అని వాపోయారు. ఆగస్టులో ఉక్రెయిన్, ఐరోపా నేతలతో మాట్లాడుతూ “ యుద్ధాల్లో మగ్గుతున్న దేశాల మధ్య నేను ఒప్పందాలు చేశాను. అవి ఆరు ఒప్పందాలు. అక్కడ నేను కాల్పుల విరమణ మాత్రమే చేయించలేదు”అని చెప్పి, ఆ మరుసటి రోజే ఆరు కాదు, ఏడు అని ట్రంప్ సవరించుకున్నారు. భారత్‌పాక్ మధ్య యుద్ధం ఆపానని సెప్టెంబర్‌లో ఓ డిన్నర్ కార్యక్రమంలో చెప్పారు. “ ఆ యుద్ధాన్ని ఎలా ఆపానో మీకు తెలుసు. నేను నోబెల్‌కు అర్హుడను. మొత్తం ఏడు యుద్ధాలు ఆపాను ” అని ప్రచారాన్ని తీవ్రం చేశారు.
నోబెల్ ప్రకటనకు ముందు స్పందిస్తూ .. ఆ అవార్డు నాకు రాకపోతే అమెరికాకు అవమానం అని వ్యాఖ్యలు చేశారు. గాజాలో రెండేళ్లుగా సాగుతున్న యుద్ధాన్ని నిలిపివేసేందుకు ఆయన ప్రకటించిన శాంతి ప్రణాళిక తొలిదశపై ఇజ్రాయెల్ హమాస్ ఒప్పందాలు చేసుకున్న సంగతి తెలిసిందే. నోబెల్ ప్రకటించడానికి మూడు రోజుల ముందు నెతన్యాహు మెడలు వంచి సంతకాలు చేయించారు. అంతకు ముందు ఆయన ఆపానని చెప్తోన్న యుద్ధాలు … అర్మేనియాఅజర్‌బైజాన్, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోరువాండా, ఇజ్రాయెల్ ఇరాన్, ఇండియా పాకిస్థాన్, కంబోడియా థాయ్‌లాండ్, ఈజిప్ట్ ఇథియోపియా, సెర్బియా కొసావో కలిపి సంఖ్య ఎనిమిదికి చేరింది.
నోబెల్ కమిటీ ఏమందంటే ..?
అమెరికా కంటే ఇతర దేశాల గురించి ఎక్కువగా ఆలోచించి, బెదిరించి యుద్ధాలు ఆపినా ట్రంప్‌నకు నోబెల్ దక్కలేదు. ఆయన పేరు మీద వచ్చిన నామినేషన్లు అన్నీ గడువు ముగిసిన తర్వాత వచ్చాయి. జనవరి 31 కే ఆ గడువు ముగిసింది. కొన్ని దేశాల నుంచి మద్దతు వచ్చినప్పటికీ నోబెల్ రాకపోవడంపై నార్వేజియన్ నోబెల్ కమిటీ ఛైర్మన్ జొర్గెన్ వాట్నె ఫ్రిడ్నెస్ స్పందించారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ ఆశయాలకు అనుగుణంగా విజేతలను ఎంచుకుంటామని చెప్పారు. “ ఈ కమిటీ మీడియా, బహిరంగ ప్రచారాలను గమనిస్తోంది. నోబెల్ గ్రహీతల చిత్రాలు ఉన్న గదిలో కూర్చుని ఆ లేఖలను మేం చూస్తాం. ఆ గది మాకు ధైర్యాన్నిస్తుంది. సమగ్రతతో పనిచేసే సంకల్పాన్ని కలిగిస్తుంది. ఆల్ఫ్రెడ్ నోబెల్ ఆశయాలకు అనుగుణంగా మేం నిర్ణయాలు తీసుకుంటాం” అని వెల్లడించారు.
త్వరితగతిన దక్కిన విజయాలకంటే స్థిరమైన, బహుపాక్షిక ప్రయత్నాలకు కమిటీ ప్రాధాన్యం ఇస్తుంటుంది. ట్రంప్ ప్రయత్నాలు సుస్థిర ఫలితాలు ఇస్తాయని ఇంకా నిరూపితం కాలేదని హెన్నీ జాక్సన్ సొసైటీలో చరిత్రకారుడుగా ఉన్న థియో జెనౌ అభిప్రాయం వ్యక్తం చేశారు. “ ఒక ఘర్షణను స్వల్పకాలం పాటు ఆపడానికి, దాని మూల కారణాలు గుర్తించి, పరిష్కరించడానికి మధ్య చాలా తేడా ఉంటుంది. ” అని వివరించారు. వాతావరణ మార్పులపై నమ్మకం లేనివారికి ఇలాంటి ప్రతిష్ఠాత్మక అవార్డులు దక్కుతాయని అనుకోవడం లేదన్నారు. అయితే ఇప్పుడు ట్రంప్‌నకు నోబెల్ మిస్ అయినా, 2026 లో ఆయన మరోసారి పోటీ పడే అవకాశం ఉంది. శాంతి బహుమతి కోసం ఆయన యుద్ధం ఇప్పుడే మొదలైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.




