
న్యూఢిల్లీ: దేశ తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ నియామకానికి ఇప్పటి ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ కేంద్రానికి సిఫార్సు చేశారు. వచ్చే నెల 23తో గవాయ్ పదవీకాలం ముగుస్తుంది. దీనితో తన స్థానం ఖాళీ భర్తీ దిశలో సిజెఐ హోదాలో గవాయ్ సోమవారం తమ ప్రతిపాదన పంపించారు. గవాయ్ తరువాత సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా సూర్యకాంత్ ఉన్నారు. సీనియార్టీ ప్రాతిపదికన ఆయనకు ఈ స్థానం దక్కాల్సి ఉంటుంది. వచ్చే నెల 24న సూర్యకాంత్ ఈ పీఠం అధిరోహిస్తే ఆయన దేశానికి 53వ ప్రధాన న్యాయమూర్తి అవుతారు.
సాధారణంగా సిజెఐ నియామక ప్రక్రియలో భాగంగా పదవిలో ఉండే సిజెఐ సిఫార్సు చేసే పేరును న్యాయ మంత్రిత్వశాఖ పరిశీలించి, పరిగణనలోకి తీసుకుని ముందు ప్రధాన మంత్రికి పంపిస్తుంది. అక్కడి నుంచి రాష్ట్రపతి వద్దకు ఫైలు వెళ్లుతుంది. తరువాత నియామక ప్రకటన వెలువడుతుంది. జస్టిస్ సూర్యకాంత్ 2019 మే 24వ తేదీన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఆయన సిజెఐ అయితే పదవీకాలం 15 నెలలు ఉంటుంది. ఈ మేరకు ఆయన 2027 ఫిబ్రవరి 9 వరకూ సిజెఐగా వ్యవహరిస్తారు.
సూర్యకాంత్ హర్యానాలోని హిస్సార్‌లో మధ్యతరగతి కుటుంబంలో 1962లో జన్మించారు. ఆర్టికల్ 370 రద్దు, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, అవినీతి , పర్యావరణం, లైంగిక సమానత వంటి పలు కీలక తీర్పుల సంబంధిత ధర్మాసనాలలో ఒక్కరిగా ఉన్నారు. కొన్ని రాష్ట్రాల ప్రధాన తీర్పులను కొట్టివేసిన సుప్రీంకోర్టు తీర్పుల ప్రక్రియలో కూడా ఆయన పాలుపంచుకున్నారు.




