
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ మరోసారి తన అప్రతిహత ప్రగతిని చాటుకుంది. రాష్ట్ర విద్యుత్ సంస్థలు మంగళవారం ఉదయం 11:01 గంటలకు నమోదైన 18,139 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్‌ను ఎటువంటి అంతరాయం లేకుండా సమర్థవంతంగా నిర్వహించాయి. ఇది రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక గరిష్ట డిమాండ్ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. రాష్ట్ర విద్యుత్ సంస్థ చరిత్రలోనే గరిష్ట డిమాండ్‌ను ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తిచేసి నాణ్యతతో కూడిన విద్యుత్ సరఫరా చేసిన విద్యుత్తు రంగంలోని ఉన్నతాధికారులు, యావత్ సిబ్బందికి భట్టి విక్రమార్క మల్లు అభినందనలు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ మైలురాయి తెలంగాణ ఆర్థిక వృద్ధి, కార్యనిర్వహణ సామర్థ్యం, అద్భుత సమన్వయానికి నిదర్శనమని పేర్కొన్నారు. భౌగోళికంగా చిన్న రాష్ట్రం అయినప్పటికీ, పెద్ద రాష్ట్రాల గరిష్ట లోడ్లకు సమానంగా లేదా అధిగమించే స్థాయికి చేరుకున్నామని హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రగతి పారిశ్రామిక, వ్యవసాయ, పట్టణాభివృద్ధిలో మన వేగాన్ని స్పష్టం చేస్తోందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
జాతీయ స్థాయిలో తెలంగాణ ప్రతిభ
తెలంగాణ 18,139 మెగావాట్ల గరిష్ట డిమాండ్ ఉండగా, సుమారు 19,900 మెగావాట్ల గరిష్ట డిమాండ్‌ను నమోదు చేసిన మధ్యప్రదేశ్, అలాగే 19,600- నుంచి 20,600 మెగావాట్ల మధ్య గరిష్ట డిమాండ్ నమోదైన రాజస్థాన్ వంటి పెద్ద రాష్ట్రాలకు దాదాపు సమానంగా నిలిచిందని అన్నారు. భూభాగం, జనాభా పరంగా చిన్నదైనా తెలంగాణ తన సామర్థ్యాన్ని చాటిందని కొనియాడారు. అదేవిధంగా పంజాబ్, హర్యానా, ఝార్ఖండ్, ఛత్తీస్‌ఘడ్ వంటి పారిశ్రామిక రాష్ట్రాల కంటే ఎక్కువ గరిష్ట డిమాండ్‌ను తెలంగాణ నమోదు చేసిందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. భౌగోళికంగా చిన్నదైనా, అధిక విద్యుత్ వినియోగ సాంద్రత కలిగిన రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తోంది. ఐటీ, ఔషధ తయారీ, తయారీ రంగం, సాగునీటి విస్తరణ వంటి రంగాల్లో వేగవంతమైన వృద్ధి దీనికి ప్రధాన కారణమని డిప్యూటీ సీఎం వివరించారు.
వేగంగా డిమాండ్ పెరుగుదల
రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోందని భట్టి పేర్కొన్నారు. 2023.-24లో గరిష్ట డిమాండ్ 15,623 మెగావాట్లు, 2024.-25లో గరిష్ట డిమాండ్ 17,162 మెగావాట్లు, 2025-.26లో 17,162 మెగావాట్లు, 2026 మార్చి 3నాటికి 18,139 మెగావాట్లు కొత్త గరిష్ట దశలోకి ప్రవేశించామని తెలిపారు. కాగా తెలంగాణ కేవలం సమకాలీన అవసరాలను తీర్చడం మాత్రమే కాదు, రాబోయే వేసవి గరిష్ట డిమాండ్లకు ముందస్తు ప్రణాళికలతో పూర్తిగా సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. బలమైన గ్రిడ్ వ్యవస్థ, ముందుచూపు ప్రణాళిక, సమన్వయంతో ఉన్న వ్యవస్థ మన బలమని అన్నారు. రాష్ట్ర విద్యుత్ రంగం అభివృద్ధిని ముందుకు నడిపేలా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. కంట్రోల్ రూమ్‌ల నుంచి నుంచి క్షేత్ర స్థాయి సిబ్బంది వరకు ప్రతి ఒక్కరి కృషి వల్లే ఈ విజయాన్ని సాధించామని స్పష్టం చేశారు. తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని డిప్యూటీ సీఎం భట్టి వెల్లడించారు.




