
మన తెలంగాణ/హైదరాబాద్: నేడు సిఎం రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం అమలుపై సచివాలయం వేదికగా కలెక్టర్లకు సిఎం రేవంత్రెడ్డి స్పష్టమైన దిశానిర్దేశం చేయనున్నారు. ప్రభుత్వ పాలనను ప్రజల చెంతకు చేర్చడమే లక్ష్యంగా ఈ నెల 06వ తేదీ నుంచి జూన్ 12 వరకు మొత్తం 99 రోజుల పాటు ఈ ప్రత్యేక కార్యక్రమం కొనసాగనుంది. ఎన్నికల హామీల అమలు, సంక్షేమ పథకాల పంపిణీ, క్షేత్రస్థాయిలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతం చేయడం ఈ ప్రణాళిక యొక్క ప్రధాన ఉద్దేశంగా పెట్టుకున్నారు. 99 రోజుల కాలంలో జిల్లాల వారీగా యంత్రాంగం ఎలా పనిచేయాలన్న విషయాల గురించి సిఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లకు దిశానిర్ధేశం చేయనున్నారు. ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులను ఎలా పరిష్కరించాలన్న అంశాల గురించి సిఎం రేవంత్రెడ్డి సమీక్షించనున్నారు. ప్రజా సమస్యల తక్షణ పరిష్కారం, సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూడటం, స్థానిక అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించడంపై చర్చించనున్నారు.




