
ఆపరేషన్ ట్రూ ప్రామిస్‌తో చర్యలు
ఇజ్రాయెల్ పై దాడుల్లో ఎనిమిది మంది మృతి
యుఎస్ లింకన్ నౌకపై దాడి .. దోహా దుబాయ్‌లలో పేలుళ్లు
ఖమేనీ అంతం తరువాత టెహరాన్ టార్గెట్
ఇకపై కోలుకోలేని దెబ్బ అని ట్రంప్ హెచ్చరిక
బుర్జు ఖలీఫ్ వద్ద హోటల్‌పై ఇరాన్ దాడి
భారతీయులు సహా పర్యాటకుల కలవరం
దుబాయ్ : తమ ప్రతీకార చర్యల ఉధృతితో ఆదివారం ఇరాన్ సేనలు విరుచుకుపడుతున్నాయి. ఓ వైపు ఇజ్రాయెల్‌లోని పలు ప్రాంతాలపై శక్తివంతమైన క్షిపణులతో దాడులకు దిగుతున్నాయి. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ పేరిట సైనిక చర్యను ఇరాన్ చేపట్టింది. ఇప్పటివరకూ ఓ ఎత్తు అయితే ఇకపై జరిగేది మరో ఎత్తు అని , తమ దాడులతో ఇక ఇజ్రాయెల్, అమెరికాలు వదలిపెట్టండని వేడుకునే పరిస్థితి వస్తుందని తెలిపారు. తమ బలగాలు ఆదివారం మధ్యప్రాచ్యంలోని 27 అమెరికా సైనిక స్థావరాలపై దాడికి దిగాయని , భారీ నష్టం వాటిల్లిందని ఇరాన్ రెవెల్యూషనరీ గార్డు వర్గాలు టెహరాన్‌లో తెలిపాయి. ఇజ్రాయెల్‌లోని టెల్‌నోప్ ఎయిర్ బేస్, ఇజ్రాయెల్ ఆర్మీ ప్రధాన కార్యాలయం హాకీర్యా పై కూడా దాడికి దిగినట్లు వెల్లడించారు.ఆదివారం ఇజ్రాయెల్‌లోని బెయిట్ షెమెష్ పట్టణంపై మిస్సైల్ దాడిలో కనీసం ఎనమండుగురు చనిపోయినట్లు. 17 మందికి పైగా గాయపడ్డట్లు ఇరాన్ తెలిపింది. పలువురు ఆసుపత్రి పాలయ్యారు. దీనిని ఆ ప్రాంత వైద్యాధికారులు కూడా ధృవీకరించారు. అమెరికాకు చెందిన యుద్ధ విమాన వాహక నౌక లింకన్‌పై దాడికి దిగాయి. యుఎస్‌ఎస్ లింకన్ ఎయిర్‌క్రాఫ్ట్ కారియర్ ఇరాన్ తీర ప్రాంతంలో మకాం వేసుకుని ఉన్నప్పుడు ఇరాన్ దాడికి గురైంది. మరో వైపు ఇరాన్ సేనలు దుబాయ్, అబూధాబి, దహా, మనామాలపై దాడులకు దిగాయి.
ఖతార్ రాజధాని దోహా ఎక్కువగా ఇరాన్ దాడులకు తల్లడిల్లుతోంది. ఇక్కడి అమెరికా సైనిక స్థావరాలను ఎంచుకుని ఆదివారం మధ్యాహ్నానికి 11 సార్లు దాడులు జరిగాయి. కీలకమైన అంతర్జాతీయ విమాన ప్రయాణ కేంద్రం అయిన ఖతార్‌లో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పటి దాడులతో దుబాయ్ వాసులు, ప్రత్యేకించి పలు ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు భయాందోళనకు గురయ్యారు. ఉదయం 8 గంటల ప్రాంతంలో వరుస పేలుళ్లు సంభవించాయి. ప్రఖ్యాత పర్యాదం బూర్జు ఖలీఫా సమీపంలోని పలు అంతస్తుల భవనాలపై దాడులు జరిగాయి. అక్కడి ఓ హోటల్ ఇరాన్ క్షిపణి దాడులతో పాక్షికంగా దెబ్బతింది. అక్కడ మకాం వేసుకుని ఉన్న పర్యాటకులు భయంతో బయటకు పరుగులు తీయాల్సి వచ్చింది. శనివారం మధ్యాహ్నం నుంచే దుబాయ్‌లోని పలు ప్రాంతాలను ఎంచుకుని దాడులు సాగుతున్నాయి. గంటల విరామంతో పేలుళ్లు విన్పిస్తూ వచ్చాయని భారత్‌కు చెందిన ఓ ఐటి నిపుణుడు ఆర్ చౌదరి దుబాయ్ నుంచి ఫోన్‌లో తెలిపాడు.ఖమేనీ అంతంతో ఇరాన్ దాడులు భీకర స్థాయికి చేరిన విషయాన్ని బ్రిటన్ రక్షణ మంత్రిత్వశాఖ నిర్థారించింది. ఆదివారం ఇరాన్ శక్తివంతమైన రెండు ఖండాంతర క్షిపణులతో విరుచుకుపడింది. క్షిపణులు సైప్రస్ దిశలో దూసుకువెళ్లాయి. అయితే సైప్రస్‌ను లక్షంగా ఎంచుకుని దాడులు జరగలేదని బ్రిటన్ వర్గాలు తెలిపాయి.
రెడ్‌లైన్ దాటినందుకు తగు శిక్ష ః ఇరాన్
ఇరాన్ ఆదివారం ఓ ప్రకటన వెలువరించింది. రెవెల్యూషనరీ గార్డు రంగంలోకి దిగింది. అమెరికా, ఇజ్రాయెల్‌లు రెడ్‌లైన్ దాటాయని , పాల్పడ్డ నేరానికి ప్రతిఫలం అనుభవించకతప్పదని ఇరాన్ పార్లమెంట్ ప్రతినిధి మెహమ్మద్ బఘెర్ ఖాలిబప్ టీవీలో ప్రసంగిస్తూ తెలిపారు. ఆదివారం తమ దాడులు తీవ్రస్థాయిలో ఉంటాయని ప్రకటించారు. చావుదెబ్బతీస్తామని హెచ్చరించారు. ఇంతకు ముందెప్పుడూ చవిచూడని విధంగా ఈ చర్య ఉంటుందని వెల్లడించారు. ఈ వాదనను ట్రంప్ తిప్పికొట్టారు. మీరేం చేయలేరని , ఒకవేళ చేస్తే తమ శక్తివంతమైన దాడికి ఇక కోలుకోలేరని స్పందించారు.
హర్మూజ్ జలసంధి మార్గంలో దాడులు
15 మంది భారతీయ నౌకా సిబ్బంది సురక్షితం
మరో వైపు ప్రపంచ చమురు రవాణాకు అత్యవసరం అయిన హర్మూజ్ జలసంధి మార్గంలో ఒమన్ వద్ద ఇరాన్ మద్దతు గల హౌతి సాయుధులు ఓ ఆయిల్ ట్యాంకర్‌పై దాడికి దిగారు. ఈ ఘటనలో నలుగురు సిబ్బంది గాయపడ్డారు. మొత్తం 20 మంది సిబ్బందిలో 15 మంది భారత జాతీయులు ఉన్నట్లు వెల్లడైంది. వీరిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఇరాన్ ఇస్లామిక్ రెవెల్యూషనరీ గార్డ్ హెచ్చరికలతో ఈ జలసంధి మార్గాన్ని మూసివేశారు. అయితే ఈ ప్రాంతంలో పలు రవాణా నౌకలు యధావిధిగా తిరుగుతున్నాయి. హర్మూజ్ జలసంధి మార్గంలో వెళ్లుతున్న ఓ ఆయిల్ ట్యాంకర్‌పై దాడికి దిగామని, అది మునిగిపోయిందని ఇరాన్ తెలిపింది. అయితే ఈ ప్రాంతంలోనే మరో నౌకపై ఇరాన్ మద్దతుగల హౌతీలు దాడికి దిగినట్లు, ఈ క్రమంలో కొందరు గాయపడ్డట్లు వెల్లడైంది. ఈ రెండు వేర్వేరు ఘటనలని ఇరాన్ తెలిపింది.ఖమేనీ అంతం తరువాత ఇజ్రాయెల్ సేనలు ఇరాన్ రాజధాని టెహరాన్‌పై భీకర క్షిపణి దాడులకు దిగాయి. ఆగకుండా సాగుతోన్న దాడులతో పలు ప్రాంతాలలో భయానక పరిస్థితి ఏర్పడింది.




