
విద్యా సంబంధమైన శిక్షణా పరిశోధన నిర్వహించే జాతీయ మండలి (ఎన్ సిఇఆర్‌టి) ఎనిమిదవ తరగతి విద్యార్థుల కోసం రూపొందించిన సామాజిక శాస్త్రంలో న్యాయ వ్యవస్థలో అవినీతికి సంబంధించి పొందుపరచిన ఒక అధ్యాయాన్ని సుప్రీం కోర్టు నిషేధించింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ అధ్యక్షతన ఏర్పాటయిన న్యాయమూర్తుల బెంచి ఈ అధ్యాయం న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దెబ్బతీయడానికి జరిగిన ప్రయత్నంగా అభివర్ణిస్తూ ‘వాళ్లు తుపాకీ పేల్చారు, న్యాయవ్యవస్థ రక్తసిక్తమైంది’ అని వ్యాఖ్యానించింది. ప్రజాస్వామ్య మూలస్తంభాలలో అత్యంత ప్రధానమైన న్యాయవ్యవస్థ విశ్వసనీయతను దెబ్బతీసే ఈ తుపాకీ గుండు పేల్చినవాళ్లు ఆ మరునాడే అదే న్యాయవ్యవస్థ నుంచి వెలువడిన ఒక తీర్పు కారణంగా గాయపడి విలవిలలాడుతున్నారు.
న్యాయవ్యవస్థ విశ్వసనీయతను దెబ్బతీసే అధ్యాయాన్ని ఎనిమిదవ తరగతి సామాజిక శాస్త్ర పాఠ్యాంశంగా చేర్చిన ఎన్‌సిఇఆర్‌టి కేంద్ర ప్రభుత్వ అధీనంలో పనిచేసేదే. కాబట్టి సుప్రీం కోర్టు బెంచి చేసిన ఈ వ్యాఖ్యానం నేరుగా రాజకీయ నాయకత్వానికి తగులుతుంది. దేశంలో అవినీతి గురించి ఎనిమిదవ తరగతి సామాజిక శాస్త్రం చదువుకునే పిల్లలకు నిజంగానే తెలియాలని ఎన్‌సిఇఆర్‌టి అనుకుంటే అన్ని రంగాలలో బ్రహ్మరాక్షసిలా జడలు విరబోసుకున్న అవినీతి గురించి, అందునా ముఖ్యంగా రాజకీయ రంగాన.. మరీ ముఖ్యంగా ఎన్నికల తంతులో వేళ్ళూనుకున్న అవినీతిని గురించి రాయించవలసింది కదా.
ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి విచారణ జరుపుతున్న రౌస్ అవెన్యూ కోర్టు ఒక చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ వెనుక కుట్ర, నేరపూరిత ఉద్దేశం లేవని తేల్చింది. నిందితులు తప్పు చేసినట్టు ఎటువంటి సాక్ష్యాధారాలు లేవని స్పష్టం చేసింది. నిందితుడిని అప్రూవర్‌గా మార్చి దర్యాప్తు జరపడంపట్ల కోర్టు తీవ్ర అభ్యంతరం తెలిపింది. సదరు నిందితుడు అరెస్ట్ అయిన కొద్ది రోజులకే అప్రూవర్‌గా మారడమే కాకుండా బెయిల్ మీద బయటికొచ్చి కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పక్షానికి 45 కోట్ల రూపాయలు ఎలెక్టోరల్ బాండ్స్ రూపంలో విరాళం ఇచ్చినట్టు నిన్నటి నుండి గోదీ మీడియా సైతం స్వయంగా కోడై కూస్తున్నది.
ప్రముఖ న్యాయ కోవిదుడు, మాజీ కేంద్రమంత్రి కపిల్ సిబ్బల్ ఈ తీర్పు వెలువడిన వెంటనే ఒక జాతీయ ఛానల్‌లో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్య ఇక్కడ గుర్తు చేసుకోవాలి ‘జైల్ భిజావో, సర్కార్ గిరావో, చునావ్ జీతో’ (జైలుకు పంపండి, ప్రభుత్వాన్ని కూలదొయ్యండి, ఎన్నికలు గెలవండి) ఇది ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్‌డిఎకు నాయకత్వం వహిస్తున్న భారతీయ జనతా పార్టీ నీతి అన్నారాయన. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్‌ఆద్మీ పార్టీ నాయకుడు, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహా ఆ పార్టీకి చెందిన ఐదుగురు ప్రముఖ నాయకులను వెయ్యి రోజులపాటు జైల్లో ఇదే కేసులో నిర్బంధించి, ఢిల్లీ ఎన్నికలు నిర్వహించి బిజెపి గెలుపొందడాన్ని గుర్తుచేస్తూ కపిల్ సిబ్బల్ ఈ వ్యాఖ్య చేశారు.
శుక్రవారం నాడు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్ట్ కొట్టేసిన ఈ మద్యం కుంభకోణం కేసులో అప్పటి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహా 23 మంది నిందితులు. వారిలో అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు కుమార్తె, తెలంగాణ జాగృతి నాయకురాలు కవిత కూడా ఉన్నారు. అరవింద్ కేజ్రీవాల్ ఆరు మాసాలు, ఆయన ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రిగా ఉన్న మనీష్ సిసోడియా దాదాపు రెండు సంవత్సరాలు, కవిత దాదాపు ఆరు మాసాలు ఈ కేసు కారణంగా జైల్లో గడపాల్సి వచ్చింది. కోర్టు ఇప్పుడు ఈ కేసును కొట్టేసింది. ప్రాథమిక సాక్ష్యాధారాలే లేవని చెప్పింది. వీళ్ళందరూ జైలులో గడిపిన రోజులను ఇప్పుడు ఎవరు తిరిగి తీసుకురావాలి? దానిని మించి వారు, వారి కుటుంబాలు, సన్నిహితులు పడ్డ మనోవేదన, క్షోభ, అవమానం సంగతి ఏమిటి? తీర్పు వెలువడిన వెంటనే మీడియాతో మాట్లాడిన అరవింద్ కేజ్రీవాల్ భావోద్వేగానికి గురై చేసిన వ్యాఖ్యలను ఇక్కడ గుర్తు చేసుకోవాలి.
‘తప్పుడు కేసులో జైలుకు వెళ్లి బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత నేను కనిపించడం లేదని, మొహం చాటేసానని రకరకాల వ్యాఖ్యానాలు వినిపించాయి. నేను రాజకీయ నాయకుడిని కాదు, నిజాయితీపరుడైన ఒక పౌరుడిని కాబట్టే అవమాన భారంతో ఇంటి నుండి బయటకు రాలేదు. రాజకీయ నాయకుల తోలు మందం కాబట్టి వాళ్లు ఇటువంటివి పట్టించుకోకుండా బయట తిరుగుతారు’ అన్నాడు. ఈ దేశంలోని మొత్తం శాసన వ్యవస్థ అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యల గురించి తీవ్రంగా ఆలోచించాలి. ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలైన నాలుగు వ్యవస్థల్లో అత్యంత ముఖ్యమైనది శాసన వ్యవస్థ. ఎందుకంటే ప్రజలతో నేరుగా సంబంధాలు కలిగి ఉంటుంది కాబట్టి తన విశ్వసనీయతను కాపాడుకోవడానికి, ప్రజలకు తన మీద విశ్వాసం చెదిరిపోకుండా చూసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించాల్సిన తరుణంఇది. మరో రెండు స్తంభాలు కార్యనిర్వాహక వర్గం, మీడియా. వీటి విశ్వసనీయత ఎంత ప్రశ్నార్థకం అయిందో చూస్తున్నాం.
ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించిన కాలంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు ఎల్‌కె అద్వానీ అప్పటి పత్రికల మీద చేసిన వ్యాఖ్య ‘వాళ్లను ఒంగి నడవమంటే నేలమీద పాకారు’ అని. ఇన్నేళ్ల తర్వాత ఆయనే ప్రాతినిధ్యం వహించిన పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిర్వాకం కారణంగా మీడియా పాలకవర్గాల ఒళ్లో కులుకుతున్నదన్న (గోది మీడియా) తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నది. ఇక ఇవాళ కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్లో నడుస్తున్న కార్యనిర్వాహక వర్గం గురించి మాట్లాడుకుంటే మొత్తం దేశం ఆలోచించాల్సిన ఒక తీవ్రమైన విషయం నిన్నటి ఈ తీర్పుతో మరింత బలంగా ముందుకు వచ్చింది. కార్యనిర్వాహక వర్గం కోవకు చెందిన దర్యాప్తు సంస్థలు సిబిఐ, ఇడి వంటి వాటి వ్యవస్థల విశ్వసనీయత మీద పడ్డ ఘోరమైన మచ్చ ఇప్పుడు మరింత చెరపరాని విధంగా మారింది.
2014లో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం ఏర్పాటు అయిన దగ్గర్నుంచి దాదాపు ఈ 12 సంవత్సరాల కాలంలో సిబిఐ, ఇడి పెట్టిన కేసులేవీ ప్రజలను ఇక నమ్మించలేవని నిన్నటి మద్యం కేసు తీర్పుతో మరింత స్పష్టమైంది. చాలా రోజులుగా న్యాయ నిపుణులు, ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను కక్ష సాధింపు కోసం, రాజకీయ ప్రత్యర్థులను వేధించడం కోసం, వారిని లోబర్చుకోవడం కోసం వాడుకుంటున్నట్టు చేస్తున్న బలమైన ప్రచారానికి ఈ తీర్పు మరింత ఊతం ఇచ్చింది. ఈ పన్నెండేళ్ళ కాలంలో అధికార కూటమికి చెందిన.. మళ్ళీ మాట్లాడితే దానికి నేతృత్వం వహిస్తున్న భారతీయ జనతా పార్టీకి సంబంధించి దేశం మొత్తం మీద ఒక్కరి మీదయినా ఇటువంటి నేరారోపణలు ఎందుకు రాలేదు? అని ప్రశ్నిస్తున్న వారు గతంలో యుపిఎ హయాంలో తమ కూటమిలోని పార్లమెంట్ సభ్యురాలిని, మంత్రిని టూజీ స్పెక్ట్రం ఆరోపణల మీద జైలుకు పంపిన ఉదంతం గుర్తు చేస్తున్నారు.
అరవింద్ కేజ్రీవాల్ తదితరుల మీద సిబిఐ పెట్టిన ఈ కేసు ప్రాతిపదికనే ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పెట్టిన మనీ లాండరింగ్ కేసు కూడా సహజంగానే నిలువదనే విషయం తెలిసిందే. ఇతర ప్రజాస్వామ్య స్తంభాల మీద వలెనే న్యాయ వ్యవస్థ విశ్వసనీయత మీద కూడా నీలినీడలు పరుచుకుంటున్నవేళ ఢిల్లీ మద్యం కేసులో రౌస్ అవెన్యూ కోర్ట్ ఇచ్చిన తీర్పు వాటిని పారదోలి వెలుగులు నింపినట్టు అయింది. ఇక రాజకీయాల విషయానికి వస్తే తెలంగాణలో భారత రాష్ట్ర సమితికి, ఢిల్లీ, పంజాబ్‌లలో ఆమ్‌ఆద్మీ పార్టీకి ఈ తీర్పువల్ల ఏమన్నా లాభం జరుగుతుందా? తీర్పు వెలువడిన వెంటనే భారత రాష్ట్ర సమితి కార్యాధ్యక్షుడు కెటి రామారావు మాట్లాడుతూ ఈ కేసు వల్లనే తమ పార్టీ గత శాసనసభ, లోకసభ ఎన్నికల్లో ఓడిపోయిందన్నారు. తమ పరిపాలనలో జరిగిన లోపాల కారణంగా ప్రజలు ఓడించారని ఇప్పటికీ ఆ పార్టీ ఒప్పుకోడానికి సిద్ధంగా లేదని అర్థం అవుతూనే ఉన్నది. అయినా తెలంగాణలో లెక్క ప్రకారం శాసనసభకు ఎన్నికలు జరిగినా ఇంకా దాదాపు మూడేళ్ళ సమయం ఉంది. కేంద్రం ఆలోచిస్తున్న విధంగా జమిలి ఎన్నికలంటూ వస్తే మరో ఆరుమాసాలు ఆలస్యం కాక తప్పదు. అప్పటివరకు ఈ అంశం ఎన్నికలను ప్రభావితం చేసి బిఆర్‌ఎస్‌కు అనుకూలంగా ప్రజాతీర్పు మారుతుందని చెప్పలేం.
రాజకీయంగా ఎవరికి ఏం లాభం జరుగుతుందో చెప్పలేం కానీ మద్యం కేసులో నిందితురాలిగా జైలుకు వెళ్ళిన కవితకు మాత్రం గొప్ప మనోధైర్యం కలిగించే తీర్పు ఇది. భారత రాష్ట్ర సమితి తనను సస్పెండ్ చేసినప్పుడు పార్టీ మీద ఆమె చేసిన ఫిర్యాదులలో ఒకటి ఈ కేసులో తనను ఇరికించినప్పుడు ఎవరూ సరిగా పట్టించుకోలేదని. ఇప్పుడు వచ్చే మే మాసంలో కొత్త పార్టీ ప్రారంభించే పనిలో ఉండగా ఆమెను నిర్దోషిగా కోర్టు ప్రకటించడం చాలా అనుకూల అంశం. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి.. మాజీ ముఖ్యమంత్రి, కవిత తండ్రి కెసిఆర్ ఆనాడే చెప్పారు. ఇది తప్పుడు కేసు అని, ఆమె కడిగిన ముత్యంలా బయటికి వస్తారనీ. ఆమ్‌ఆద్మీ పార్టీని ఖతం చెయ్యాలన్న బిజెపి ప్రయత్నం బెడిసికొట్టి ఇంకో ఏడాది కూడా లేని పంజాబ్ ఎన్నికల్లో ఈ అంశం కేజ్రీవాల్‌కు సానుభూతి తెచ్చి ఘన విజయం సాధించిపెట్టినా ఆశ్చర్యం లేదు. నిజమే, కేజ్రీవాల్ నిన్న తీర్పును ఆహ్వానిస్తూ మీడియాతో మాట్లాడినప్పుడు అన్నట్టుగా దేశమంతటా మంచి రోడ్లు వేసి, వాడవాడలా మొహోల్లా క్లినిక్‌లు ప్రారంభించి ప్రజల మన్నన పొంది ఎన్నికలు గెలవాలి కానీ సిబిఐ, ఇడిలను ఉసిగొల్పితే రౌస్ అవెన్యూ కోర్టు తీర్పులాంటి ఎదురు దెబ్బలు ఇంకొన్ని తప్పవేమో.





