
న్యూయార్క్ : అమెరికా ఈశాన్య ప్రాంతాన్ని సోమవారం మంచు తుఫాను ముంచెత్తింది. న్యూయార్క్ సహా పలు నగరాల్లో వీధులు దట్టమైన మంచుతో ప్రమాదకరంగా మారాయి. లక్షలాది మంది ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రజా రవాణా వ్యవస్థ స్థంభించింది. దేశీయ విమానాలతో సహా దాదాపు10 వేల విమానాలు రద్దయ్యాయి. విమానాశ్రయాలు ఖాళీగా మారాయి. స్కూళ్లు మూతపడ్డాయి. భారీ హిమపాతం, బలమైన చలిగాలులతో జన జీవనం స్థంభించింది. రద్దీగా ఉండే టెర్మినల్స్ నిర్మానుష్యంగా మారాయి. ఈ ప్రాంతం అంతటా విమాన ప్రయాణానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. తుఫాన్ తీవ్రత నేపథ్యంలో ముందుగానే విమానయాన సంస్థలు ముందస్తుగా విమాన సేవలను రద్దు చేశాయి. శనివారం, మంగళవారం మధ్య 10 వేల కంటే ఎక్కువ విమానాలు రద్దయ్యాయి.
సోమవారం 5 వేలకంటే ఎక్కువ వి మాన సర్వీసులు రద్దు కాగా, మంగళవారం 1, 300 కంటే ఎక్కువ సర్వీసులు రద్దయ్యాయి.న్యూయార్క్ లోని జెఎఫ్ కె , లాగ్వార్డియా విమానాశ్రయాలు, బోస్టన్ లోగన్, న్యూవార్క్ లిబర్టీ వంటి ప్రధాన కేంద్రాలపై తీవ్ర ప్రభావం పడింది. రైళ్లు, బస్సు నెట్ వర్క్ కు బంద్ అయ్యాయి. చాలా స్టేట్ లలో సేవలు నిలిచి పోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. చాలా ప్రాంతాలలో అధికారులు ప్రయాణ ఆంక్షలు విధించారు న్యూయార్క్ నగరం లో సోమవారం మధ్యాహ్నం వరకూ ప్రయాణాలను నిషేధించగా, న్యూయార్క్ స్టేట్, న్యూజెర్సీ, రోడ్ ఐలాండ్ లొన్ని కొన్ని ప్రాంతాలలో ఇలాంటి ఆదేశాలు జారీ అయ్యాయి. న్యూయార్క్ నగరం లోని రోడ్లపై దట్టంగా మంచు పోగుపడింది. దానిని తొలగించేందుకు నిర్విరామంగా సిబ్బంది కష్టపడుతున్నారని మేయర్ అన్నారు.
15 అడుగులకు పేరుకున్న మంచు
న్యూయార్క్ నగరంలోని సెంట్రల్ పార్క్ లో సోమవారం ఉదయం 15 అంగుళాల కంటే ఎక్కువ మంచు నమోదైంది. లాంగ్ ఐలాండ్, న్యూజెర్సీ లో అంతటా అధికమంచు నమోదైంది. బోస్టన్, ఫిలడెల్ఫియాలోనూ అదే పరిస్థితి. గంటకు 35 మైళ్ల వేగంతో చలిగాలులు వీస్తున్నాయ. డెలావేర్, మసాచుసెట్స్ లో 40- 60ఎంపిహెచ్ వేగంతో గాలులు వీచాయి. మంచు తుఫాను కారణంగా 5 లక్షల70 వేల ఇళ్లలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. మాసాచ్యుసెట్స్ , న్యూజెర్సీలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.




