
మన తెలంగాణ/న్యూస్ నెట్‌వర్క్: ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో ఈదురుగాలు లు భీభత్సం సృష్టించాయి. హైదరాబాద్ నగరంలో పలుచోట్ల వర్షం కురిసింది. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో ఈదురు గాలుల తో కూడిన వర్షానికి యాసంగి పంటలు గోధు మ, మొక్కజొన్న పంటలు నేలకొరిగి తీవ్రంగా దెబ్బతిన్నాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డా యి. అర్లి సబ్‌స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. జోరుగా కురిసిన వర్షానికి అర్లి, అంతర్గావ్, గోమూత్రి, గుబిడి గ్రామాల్లో కోతకు వచ్చిన యాసంగి పంటలు చేతికి అందకుండా పోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. జయశంకర్ భూపాలపల్లి మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో అకాల వర్షంతో జన జీవనం ఒక్కసారిగా స్తంభించింది.
ఉరుములు మెరుపులతో భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. కాళేశ్వరంలో గాలి వానకు పలుచోట్ల చెట్లు నేలకూలాయి. వివిధ ప్రాంతాల్లో విద్యుత్తు స్తంభాలు నేలకూలడంతో తీగలు తెగిపడ్డాయి. ఊహించని వర్షం కారణంగా మిర్చి పంట సాగు చేస్తున్న రైతులు పంట నష్టం వాటిల్లిందని ఆవేదన చెందుతున్నారు.మరోవైపు సిద్దిపేట జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దుబ్బాక పట్టణంలో వర్షం బీభత్సం సృష్టించింది. భారీ ఈదురు గాలులతో పలు ప్రాంతాల్లోని చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ తీగలు తెగిపడటంతో పట్టణమంతా విద్యుత్ నిలిచిపోయింది. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉరుములు, మెరుపుల హోరుతో ప్రజలు కొంత భయాందోళనకు గురయ్యారు. మధ్యాహ్నం నుంచి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఆకాశం మేఘావృతమై ఉష్టోగ్రతలు పడిపోయాయి. నగరంలోని ఖైరతాబాద్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్, చిక్కడపల్లి, గాంధీనగర్, అంబర్‌పేట్, బర్కత్‌పురా, చంపాపేట్, సైదాబాద్, కర్మన్‌ఘాట్, అబిడ్స్, బషీర్‌బాగ్, సైఫాబాద్, ట్యాంక్ బండ్, కాచిగూడ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది.
మేడ్చల్ జిల్లాలో ఈదురుగాలులు
మేడ్చల్ జిల్లాలో ఉదయం నుంచి పొడిగా ఉన్న వాతావరణం మధ్యాహ్నం కాగానే ఒక్కసారిగా మబ్బులతో కమ్ముకుంది. వేగంగా ఈదురు గాలులు వీచి భారీ వర్షం కురిసింది. ఎల్బీనగర్ పరిసరాలైన హయత్‌నగర్,పెద్ద అంబర్‌పేట్ లాంటి పలు చోట్ల వాన చినుకులు నేలను తాకాయి. రాబోయే మూడు రోజుల పాటు తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
నిర్మల్‌లో వడగళ్ల వాన
జగిత్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, వడగళ్ల వాన కురిసింది. మెట్‌పల్లి, మల్లాపూర్ మండలాల్లో విద్యుత్ నిలిచిపోయింది. ఈదురుగాలులతో పలు ప్రాంతాల్లో మామిడి కాయలు రాలాయి. నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్ గ్రామంలో వడగళ్ల వాన కురిసింది. మంచిర్యాల జిల్లా మందమర్రిలోనూ అకస్మాత్తుగా భారీ వర్షం కురిసింది. దట్టమైన మేఘాలు కమ్ముకుని భారీ ఈదురు గాలులతో వాన కురిసింది. దీంతో పలు చోట్ల రహదారులు జలమయం కావడంతో వాహదారుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
0.9 కిలోమీటర్ల ఎత్తులో మరో ద్రోణి
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి దక్షిణ అంతర్గత కర్ణాటక ప్రాంతం నుంచి మరాత్వాడ వరకు ద్రోణి ఒకటి సగటు సముద్ర మట్టం నుంచి 0.9 కిలో మీటర్ల ఎత్తులో ఏర్పడినట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. వెస్ట్ బెంగాల్ ప్రాంతం నుండి తూర్పు కోస్తా ఆంధ్ర తీరం వరకు ఒడిశా మీదుగా సగటు సముద్ర మట్టం నుంచి 0.9 కిలో మీటర్ల ఎత్తులో మరొక ద్రోణి ఈరోజు ఏర్పడినట్లు ఒక ప్రకటనలో పేర్కొంది.
ఉరుములు, మెరుపులతో వర్షం
ఆదివారం నైరుతి బంగాళాఖాతం ప్రాంతంలోని తీవ్ర అల్పపీడన ప్రాంతం నుంచి మధ్య తమిళనాడు అంతర్గత కర్ణాటక మీదుగా మహారాష్ట్ర వరకు కొనసాగిన ద్రోణి ఈ రోజు బలహీన పడినట్లు తెలిపింది. మంగళవారం ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్ధపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, సంగారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు ప్రకటించింది.
సోమవారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణంలో మార్పులతో భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలలతో భారీ వర్షం కురవడంతో మంచిర్యాల జిల్లా తడిచి ముద్దయ్యింది. కురిసిన అకాల వర్షంతో మామిడి చెట్లకు ఉన్న పూత ఒక్క సారిగా రాలి పోవడంతో ఇక మామిడి కాయల పరిస్థితి కష్టంగా మారింది. అలాగే మండలంలో తెల్లబంగారం పండించిన రైతులకు ఇంకా కొందరు పత్తి ని చెట్టు మీద నుండి తెంపక పోవడంతో సోమవారం కురిసిన అకాల వర్షానికి తడిచిపోయి రైతులకు నష్టాన్ని చవి చూపించింది.




