Monday, March 2, 2026
Google search engine
HomeUncategorizedరాంచందర్‌రావు అరెస్ట్

రాంచందర్‌రావు అరెస్ట్

మన తెలంగాణ/హైదరాబాద్: కామారెడ్డి జిల్లా బాన్సువాడలో రెండు రో జులుగా అల్లర్లు జరుగుతున్న ప్రాంతానికి వెళ్ళేందుకు యత్నించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావును పోలీసులు అరెస్టు చేశారు. ఈ దశలో పోలీసులకు-కార్యకర్తలకు మధ్య తోపులాట జరగడంతో తార్నాకలోని ఆయన నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బిజెపి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఇంటిపై అల్లరి మూకలు దాడి చేయడం, ఇంకా రెండు రోజులు గా అల్లర్లు జరిగిన నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని సందర్శించేందుకు ఆదివా రం ఉదయం రాంచందర్ రావు బయలుదేరాలనుకున్నారు. అయితే ఈ వి షయాన్ని ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలుసుకున్న పోలీసులు తార్నాకలో ని ఆయన ఇంటి వద్ద పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. పోలీసు అధికారులు రాంచంద్రరావు ఇంట్లోకి వెళ్ళి, బాన్సువాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నందున ఈ సమయంలో ఆ ప్రాంతానికి వెళ్ళడం శ్రేయస్కరం కాదని, మీరు వెళ్ళడం ద్వారా పరిస్థితులు మరింతగా ఉద్రిక్తమయ్యే అవకాశం ఉందని నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అయినా రాంచందర్ రావు వినిపించుకోలేదు, ప్రజాస్వామ్యంలో తాను స్వేచ్ఛగా అక్కడికి వెళ్ళేందుకు అవకాశం ఉందన్నారు.

తనను నిలువరించవద్దని ఆయన చెప్పారు. తమ పార్టీ అధ్యక్షుడు రాంచందర్ రావును పోలీసులు గృహ నిర్భంధం చేశారని టివీలు, సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకోసాగారు. పరిస్థితిని గమనించిన పోలీసులు ఇంటి సమీపంలో బ్యారికేడ్లు ఏర్పాటు చేసి వారిని నిలిపి వేశారు. దీంతో కార్యకర్తలు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేయసాగారు. మరోవైపు ఇంట్లో గృహ నిర్భంధంలో ఉన్న రాంచందర్ రావు పోలీసు అధికారుల నుంచి తప్పించుకుని బయటకు వచ్చి వాహనంలో కామారెడ్డి (బాన్సువాడ) బయలుదేరేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు బలవంతంగా రాంచందర్ రావును అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తీసుకుని వెళ్ళాలనుకున్నారు. ఈ దశలో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. చివరకు పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. అడ్డువచ్చిన పలువురు కార్యకర్తలనూ పోలీసులు అదుపులోకి తీసుకుని బొల్లారం పోలీసు స్టేషన్‌కు తీసుకుని వెళ్ళారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో పోలీసులు ఆయనను విడుదల చేశారు.

తప్పుడు కేసులు పెడితే సహించేది లేదు..

అనంతరం రాంచందర్ రావు మీడియాతో మాట్లాడుతూ హిందువులపై, తమ పార్టీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడితే సహించేది లేదని హెచ్చరిచారు. తమ పార్టీ ఎమ్మెల్యే నివాసంపై దాడి జరిగినందున సంఘీభావం తెలిపేందుకు తాను ఇంటి నుంచి బయలుదేరుతుండగా, పోలీసులు అడ్డుకున్నారని ఆయన విమర్శించారు. మజ్లీస్ చేతిలో సర్కార్ బందీ అయ్యిందని ఆయన దుయ్యబట్టారు. మజ్లీస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ చెప్పినట్లే సర్కారు నడుచుకుంటున్నదని ఆయన విమర్శించారు. తాము శాంతియుతంగా నిరసనకు పిలుపునిస్తే అన్యాయంగా అరెస్టు చేయడం సరైన పద్ధతి కాదన్నారు. అల్లర్లు జరిగిన బాన్సువాడలో కేవలం హిందువులపైనే కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. పోలీసు అధికారులు ప్రభుత్వానికి తొత్తుల్లా వ్యవహారించరాదని రాంచందర్ రావు సూచించారు.

స్పందించిన కేంద్ర మంత్రులు

రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీ బలపడుతుండడంతో భయపడుతున్న కాంగ్రెస్ అక్రమ అరెస్టులతో అణచి వేయాలని ప్రయత్నిస్తున్నదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రాజకీయ అరెస్టులను నిలిపి వేసి, ప్రజాస్వామ్య హక్కులను గౌరవించాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోందా? అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆగ్రహంగా ప్రశ్నించారు. నాటి ఎమర్జెన్సీ రోజులు గుర్తు వచ్చేలా ప్రభుత్వం ప్రవర్తిస్తున్నదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్-మజ్లీస్ పార్టీలు కలిసే అరాచకాలు సృష్టిస్తున్నాయని ఆయన ఆరోపించారు. వీరి అరాచకాలను అడ్డుకోవడానికి కార్యకర్తలు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

తమ పార్టీ అధ్యక్షుడు రాంచందర్ రావును పోలీసులు అరెస్టు చేయడం అణచి వేయడానికి చేస్తున్న ప్రయత్నమని మహబూబ్‌నగర్ నియోజకవర్గం బిజెపి ఎంపీ డికె అరుణ ధ్వజమెత్తారు. పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన చేస్తున్నారని ఆమె ఒక ప్రకటనలో విమర్శించారు. తమ పార్టీ నాయకులను గృహ నిర్భంధం, కార్యకర్తలను అరెస్టు చేయడం ద్వారా భయపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని బిజెపి రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి ఎన్‌వి సుభాష్ విమర్శించారు. బాన్సువాడ ఘటనపై రాష్ట్ర డిజిపి స్వయంగా విచారణ జరపాలని విశ్వ హిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ రావినూతల శశిధర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర హైకోర్టు కూడా సుమోటోగా కేసును స్వీకరించాలని ఆయన కోరారు. న్యాయం అడిగితే హిందువులపై హత్యాయత్నం వంటి తీవ్రమైన కేసులను పోలీసులు నమోదు చేస్తున్నారని ఆయన విమర్శించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments