
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధి విషయంలో ఎలాంటి రాజకీయాలకు తావు లేదని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ స్పష్టం చేశారు. తెలంగాణానే కాదు ఏ రాష్ట్ర అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అవకాశం ఉండదని పేర్కొన్నారు. కేంద్రం, రాష్ట్రం కలిసి పని చేసి రాష్ట్రాభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సహకారం భారత పురోగతికి ఎంతో అవసరమని ఆకాంక్షించారు. ‘ఆర్థిక అక్షరాస్యత, స్థితిస్థాపకతపై జాతీయ స్థాయి సమావేశం, 25వ కేంద్ర స్థాయి సమన్వయ కమిటీ సమావేశం శనివారం నాడిక్కడ ఒక హోటల్లో జరిగింది. ఈ సమావేశానికి శివరాజ్ సింగ్ చౌహాన్ విశిష్ట అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ అభివృద్ది కోసం రాజకీయాలు పక్కన పెట్టి తెలంగాణ ప్రభుత్వ కలిసి వస్తుందని, ఇందుకు గాను తెలంగాణ ప్రభుత్వానికి అభినంనలు తెలుపుతున్నానని అన్నారు. దేశవ్యాప్తంగా లక్ పతి దీదీ కార్యక్రమం ద్వారా మహిళలను ఆర్థికంగా బలపరుస్తున్నామని శివరాజ్ సింగ్ తెలిపారు. ఇప్పటికే కోట్లాది మహిళలు ఎస్హెచ్జిల ద్వారా బ్యాంకింగ్ వ్యవస్థలో భాగస్వాములయ్యారన్న కేంద్రమంత్రి బ్యాంకర్లు కేవలం రుణదాతలుగా కాకుండా భాగస్వాములుగా మారాలని సూచించారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు రుణాలు ఇవ్వడమంటే దేశానికి అత్యంత సురక్షితమైన పెట్టుబడిగా భావించడమేనని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. వికసిత భారత్ దార్శనికతకు మహిళా సంఘాలు గణనీయంగా దోహదపడుతున్నాయని అభినందించారు.
మూడు ప్రధాన జాతీయ కార్యక్రమాలు ప్రారంభం
హైదరాబాద్ వేదికగా జరిగిన సమావేశంలో మూడు ప్రధాన జాతీయ స్థాయి కార్యక్రమాలను ప్రారంభించారు. స్వయం సహాయ బృంద సభ్యుల కోసం వ్యక్తిగత ఎంటర్ప్రైజెస్ బ్యాంకు రుణ విధానం, స్వయం సహాయ బృంద సభ్యుల కోసం యుపి ఐ ఆధారిత క్రెడిట్ లైన్లు, స్వయం సహాయ బృంద సభ్యుల కోసం ఆర్థిక అక్షరాస్యతపై డిజిటల్ మాడ్యూల్స్ ఈ వేదికగా ప్రారంభమయ్యా యి. ఈ మూడింటి ద్వారా క్రెడిట్ డెలివరీని సులభతరం చేయడం, డిజిటల్ ఫైనాన్స్ స్వీకరణను ప్రోత్సహించడం, గ్రామీణ మహిళల్లో ఆర్థిక సామర్థ్యాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమావేశంలో గ్రామీణాభివృద్ధి కార్యదర్శి శైలేష్ కుమార్ సింగ్ వెల్లడించారు.
మహిళా సాధికారతే దేశ ప్రగతికి పునాది: మంత్రి సీతక్క
ఈ సమావేశానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిస్తూ మహిళా సాధికారతే దేశ ప్రగతికి పునాది అని స్పష్టం చేశారు. సిఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం మహిళల ఆర్థిక స్వావలంబనకు అత్యున్నత ప్రాధాన్యం ఇస్తోందని అన్నా రు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆలోచనల ఆధారంగా మహిళల అభివృద్ధినే సమాజ అభివృద్ధిగా భావిస్తున్నామని తెలిపారు. దేశంలోనే అతి చిన్నవయసు రాష్ట్రమైన తెలంగాణ సగటున 12.9 శాతం వార్షిక వృద్ధి రేటుతో వేగంగా అభివృద్ధి చెందుతోందని, పేదరికాన్ని తగ్గించడంలో నీతి ఆయోగ్ ప్రశంసలు అందుకుందని గుర్తు చేశారు.




