
న్యూఢిల్లీ : భారత్ , బ్రెజిల్ మధ్య వచ్చే ఐదేండ్లలో 20 బిలయన్ డాలర్ల విలువైన ద్వైపాక్షిక వాణిజ్య లక్షం ఖరారు అయింది. ఏఐ సదస్సులో పాల్గొనేందుకు ఇక్కడికి వచ్చిన బ్రెజిల్ అధ్యక్షులు లూలా డ సిల్వా, భారత ప్రధాని నరేంద్ర మోడీ మధ్య శనివారం విస్తృత చర్చల తరువాత ఈ మేరకు వ్యాపార వాణిజ్య లక్షం ఖరారు అయింది. దీనితో పాటు ఇరుదేశాల మధ్య అత్యంత కీలకమైన ఖనిజాల రంగంలో పరస్పర సహకారం దిశలో కూడా అంగీకారం కుదిరింది. ఇరుదేశాల మధ్య చిరకాల సత్సంబంధాలు మరింతగా ముందుకు సాగేందుకు వీలేర్పడిందని ప్రధాని మోడీ సామాజిక మాధ్యమం ద్వారా ప్రకటించారు. ఉగ్రవాదం ప్రపంచానికి శత్రువు అయింది.
టెర్రరిజం మద్దతుదార్లు మానవాళికి ముప్పుగా మారుతున్నారనే అంశంపై భారత్ , బ్రెజిల్ దేశాలది ఒకటే మాట అని ప్రధాని తెలిపారు. ప్రపంచ స్థాయి సవాళ్లను ఎదుర్కొనే రీతిలో ప్రపంచ స్థాయి సంస్థల సంస్కరణ అవసరం అని మోడీ, లూలా అభిప్రాయపడ్డారు. టఇరుదేశాలు రక్షణ, భద్రత, ఇంధన, ఆరోగ్య పరిరక్షణ, డిజిటల్ ప్రజా మౌలిక సాధనాసంపత్తుల విషయంలో పటిష్ట బంధం దిశలో చర్చలు సాగాయి. విభజిత భౌగోళికరాజకీయ వాతావరణంలో ఇరుదేశాలు వ్యూహాత్మక ముందడుగు గురించి ఎప్పటికప్పుడు సంప్రదింపుల ప్రక్రియ సాగిస్తూ ఉండాలని కూడా ఇరువురు నేతల మధ్య అంగీకారం కుదిరిందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ నెల 18 నుంచి లూలా భారత పర్యటనలో ఉన్నారు. ఏఐ సదస్సుకు హాజరుకావడంతో పాటు, మోడీతో కీలక చర్చలు జరిపారు.




