Monday, March 2, 2026
Google search engine
HomeUncategorizedజాగృతీ.. జర జాగ్రత్త!

జాగృతీ.. జర జాగ్రత్త!

తెలంగాణ జాగృతి నాయకురాలు కవిత పార్టీ ఎప్పుడు ప్రారంభిస్తారో స్పష్టమైపోయింది. ఆమె ఒక పార్టీ పెట్టబోతున్నారన్నమాట కొంతకాలం క్రితమే ఖాయమైనా ఎప్పుడు పెడతారనే విషయం మాత్రం గురువారంనాడు స్పష్టమైంది. మే నెలలో రాజకీయ పార్టీ ప్రారంభానికి ముహూర్తం పెట్టుకున్నానని తానే పత్రికల వారితో చెప్పారు. ఇది ఎవరికీ ఆశ్చర్యం కలిగించే విషయం కానీ, దిగ్భ్రాంతి గొలిపే విషయం కానీ కాదు. తండ్రి అధ్యక్షుడిగా ఉన్న భారత రాష్ట్ర సమితి నుండి సస్పెండ్ అయిననాడే ఆ ఛాయలు గోచరించాయి.వచ్చే మే మాసంలో కవిత ప్రారంభించబోయే రాజకీయ పార్టీ పేరు బహుశా తెలంగాణ జాగృతి పార్టీ అయి ఉంటుంది. ఆమె తన పార్టీ పేరులో తెలంగాణ ఉంటుందన్నారు కాబట్టి, జాగృతి పేరిట చేసిన కార్యక్రమాలతో ఆమె తెలంగాణ ఉద్యమకాలం నుంచి ఎంతో గుర్తింపు పొంది ఉన్నారు కాబట్టి తెలంగాణ, జాగృతి.. ఈ రెండు పదాలు పార్టీ పేరులో ఉండేట్టు చూసుకుంటారని అర్థం అవుతున్నది. ప్రస్తుతానికి ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరు తెలంగాణ జాగృతి పార్టీ (టీజేపీ) అనుకుందాం.

భారత పౌరురాలిగా రాజకీయ పార్టీని పెట్టుకునే హక్కు, స్వేచ్ఛ కవితకు పూర్తిగా ఉన్నాయి. ఆమె మొన్నటి పత్రికాగోష్ఠిలో ఒక మాట అన్నారు. పార్టీలు పెట్టి ఫెయిల్ అయిన మగవాళ్ళ గురించి ఎందుకు మాట్లాడరు అని. పార్టీ ఇంకా ప్రారంభించక ముందే పాస్, ఫెయిల్ లెక్కలు ఎందుకు గాని, మగ అయినా ఆడ అయినా ఒక రాజకీయ పార్టీ పెట్టడం అంటే చెప్పుల్లో కాళ్లు పెట్టుకొని, జేబుల్లో చేతులు పెట్టుకొని బజారుకు వెళ్లి వచ్చినంత సులభమే కావచ్చు, కానీ, వాటిని నిలబెట్టడం, అంతిమ లక్ష్యమైన అధికారానికి చేరుకోవడం అన్నది అందరి వల్ల అయ్యే పని కాదు.దేశమంతటా ఎందుకు, మనం ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో అయినా, విడిపోయాక రెండు తెలుగు రాష్ట్రాల్లో అయినా కనీసం వేళ్ళ మీద లెక్కబెట్ట గలిగినంతమంది పార్టీలు పెట్టారు కదా, ఏమయ్యారు వాళ్లంతా? ఒక నాయకుడి మీద కోపంతోనో, ఒక రాజకీయ పార్టీలో తనకు ప్రాధాన్యత లభించడం లేదన్న దుగ్ధతోనో లేదా గ్లామర్ ను ఉపయోగించుకుని అప్పనంగా అధికారంలోకి వచ్చేద్దామనుకునో పార్టీలు పెట్టినంత మాత్రాన అవి నిలబడవు. మన రాష్ట్రంలో, దేశంలో ప్రాంతీయ పార్టీల ఆవిర్భావం, వాటి మనుగడ, కొనసాగింపు గురించి త్వరలో మరో ప్రాంతీయ పార్టీకి ప్రాణం పోయనున్న కవిత అధ్యయనం చేసే ఉండాలి. లేదా అటువంటి విషయాలలో సంపూర్ణ అవగాహన కలిగినవారితో సంప్రదింపులు, చర్చలు జరిపి ఉండాలి.

రాజకీయాల్లో మగవాళ్ళ ఫెయిల్యూర్ గురించిన ప్రస్తావన ఆమె ఎందుకు తీసుకొచ్చారంటే బహుశా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల రాజకీయ పార్టీ పెట్టి ఫెయిల్ అయినందున ఆమెతో తనను పోల్చుతున్నారనే ఆలోచనతో ఆ మాట అంటూ ఉండవచ్చు. ఇందులో లింగ వివక్ష ఏమీ ఉండదు. పార్టీలు పెట్టేవాళ్ళు ఆడ అయినా, మగ అయినా అవి దీర్ఘకాలం మనుగడ సాగిస్తాయా, పుబ్బలో పుట్టి మఖలో మాడిపోతాయా అన్నది ఆనాటి రాజకీయ పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది.1982 లో ఎన్టీ రామారావు పార్టీ పెట్టేనాటికి ఆయనకు రాజకీయాల్లో ఏబిసిడిలు తెలియవు. కానీ ఆనాటి ఆంధ్రప్రదేశ్ రాజకీయ మైదానంలో ఫుట్బాల్ ఉందిగానీ ఆడేవాళ్లే లేరు. గ్రౌండ్ అంతా ఆయనదే. అంతకుముందు జాతీయస్థాయిలో శ్రీమతి ఇందిరాగాంధీ చారిత్రక కాంగ్రెస్ పార్టీని చీల్చి కొత్త పార్టీ పెట్టినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ లో అదే పరిస్థితి. ఆ పార్టీ చేసిన తప్పుల వల్ల ఐదేళ్లలోనే మైదానం ఖాళీ అయింది ఎన్టీఆర్ కు అవకాశం వచ్చింది. ఆ తర్వాతి కాలంలో నాదెండ్ల భాస్కరరావు, లక్ష్మీపార్వతి, మధ్యలో జానారెడ్డి , వసంత నాగేశ్వరరావు, కేఈ కృష్ణమూర్తిత్రయం, తర్వాత చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ పార్టీని చీల్చి పార్టీలు పెట్టుకున్నారు. ఈ జాబితాలో ఒక్క చంద్రబాబు నాయుడు తప్ప అందరూ ఫెయిల్ అయిన మగవాళ్లే, ఒక్క లక్ష్మి పార్వతిని మినహాయిస్తే.

తెలుగు రాష్ట్రాల్లో సొంతంగా రాజకీయ పార్టీలు పెట్టుకుని గాని, ఉన్న రాజకీయ పార్టీల్లోనే పనిచేస్తూ గానీ పెద్దగా రాణించిన మహిళలు తక్కువ. ఇప్పుడు తానంత తీవ్రంగా విమర్శిస్తున్న తన మాజీ పార్టీలో కూడా ఒక మంత్రివర్గంలో కేసీఆర్ మహిళలకు స్థానం కల్పించకపోగా రాజ్ భవన్ లో ప్రమాణస్వీకారోత్సవ సమయంలో విలేకరులు ఒక మగ మంత్రిని ‘మీ మంత్రివర్గంలో మహిళలు కనిపించడం లేదేమిటి?’ అనడిగితే ఇంట్లో ఉన్నారని చెప్పి తీవ్ర విమర్శలకు గురయిన విషయం తెలిసిందే. కవిత అప్పటికి ఆపార్టీలోనే ముఖ్య నాయకురాలుగా ఉన్నారు.మహాపర్వతాల్లాంటి రాజకీయ పార్టీలను ఢీకొట్టి నిలిచి గెలిచిన మహిళలు మనకు కనిపిస్తారు. ఇందిరాగాంధీ, ఆమె పార్టీలోనే రాజకీయాలు నేర్చుకున్న మమతా బెనర్జీ, పొరుగున తమిళనాడులో జయలలిత, ఉత్తరాదిన మాయావతి వంటి వాళ్ళు ఈ దేశ రాజకీయాల్లో కచ్చితంగా తమదైన, బలమైన ముద్ర వేశారు. కాబట్టి కవిత మహిళ కాబట్టి ఆమె రాజకీయాల్లో ఫెయిల్ అవుతారని ఎవరూ అనుకోవాల్సిన అవసరం లేదు. షర్మిల కూడా మహిళ కాబట్టి ఫెయిల్ కాలేదు. ఆమె రాజకీయాలకోసం ఎంచుకున్న ప్రాంతం కానీ సమయం కానీ ఆ వైఫల్యానికి కారణం. పత్రికల వాళ్ళు రాసేవన్నీ నిజమే అనుకుని కూడా రాజకీయాల్లోకి వస్తే ఏం జరుగుతుందో చెప్పడానికి షర్మిల పెద్ద ఉదాహరణ. షర్మిల ఫెయిల్యూర్ లీడరేం కాదు, ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలు అని కవిత సర్టిఫికెట్ ఇచ్చినట్టున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కి అధ్యక్షురాలిగా షర్మిలను నియమించాలన్న పనికిమాలిన ఆలోచన ఎవరిదైనా అదెంత వృథాప్రయాసో ఆరాష్ట్ర రాజకీయాల్ని పరిశీలిస్తున్న వాళ్ళందరికీ అర్థం అవుతున్నది.

ఇక పార్టీలు పెట్టి ఫెయిల్ అయిన మగవాళ్ళని గురించి కూడా చాలా మాట్లాడుకోవచ్చు. ఇప్పటి తరానికి గుర్తుందో లేదో కానీ, ఇలాంటివన్నీ గుర్తుండాలంటే చరిత్ర చదవాలి. రాజకీయాల గత చరిత్రను తెలుసుకునే అంత ఆసక్తి ప్రస్తుత తరానికి ఉందో లేదో తెలియదు కానీ, ఏవీఎస్ రెడ్డి అని ఒక అత్యంత సమర్థవంతుడైన ఐఏఎస్ అధికారి ఉండేవారు. ఆయనకు ఎందుకు వచ్చిందో ఆలోచన హఠాత్తుగా సర్వీస్ కి రాజీనామా చేసి ‘భారతదేశం’ పేరిట రాజకీయ పార్టీ ప్రారంభించారు. అది అడ్రస్ లేకుండా పోయింది. అదృష్టం కొద్దీ ఆయనకు తన ఉద్యోగం మళ్ళీ లభించింది. 2009 కి ముందు ప్రముఖ సినీ హీరో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. అధికారంలోకి రావడానికి అది సరైన సమయం కాకపోయినా ప్రాతినిధ్యం వహిస్తున్న సామాజికవర్గం రా జకీయంగా ప్రాధాన్యత లభించడం లేదన్న అ సంతృప్తితో రగిలిపోతున్న కాలం కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 294 స్థానాల్లో ఓ 18 స్థానాలు గెలుచుకోగలిగారు.

ఓర్పు చాలా అవసరం. రాజకీయాల్లో కోరిక అనే గుర్రం ఎక్కాలని అందరికీ ఉంటుంది. ఎక్కుతారు కూడా. కానీ ఆ గుర్రం మన అదుపులో ఉందో లేదో చూసుకోవాలి. గుర్రాన్ని అదుపులో పెట్టే యుక్తి, ఓపిక చిరంజీవికి లేకపోయింది. చాలా కొద్దికాలం ఓపిగ్గా పార్టీ నడిపి ఉంటే, విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రజారాజ్యం పార్టీ ఒక బలమైన శక్తిగా ఎదిగి వచ్చే అవకాశం ఉండేది. అంటే, ఆ తర్వాత జనసేన పేరిట ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టలేదా, నూటికి నూరు శాతం గెలిచి 2024లో 21 స్థానాలు సంపాదించలేదా అనొచ్చు ఎవరైనా. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ముక్కు పచ్చలారని పసిపిల్లలను అడిగినా చెప్తారు పవన్ కళ్యాణ్ కానీ, ఆయన పార్టీ గానీ అక్కడ ఏ స్థితిలో ఉందో. అలాగే మరికొందరు మగధీరులు కత్తులు పట్టుకొని, గుర్రాలు ఎక్కి రాజకీయరంగంలోకి దూకి తాము పట్టినవి కత్తులు కావు అట్టముక్కలని అర్థం అయ్యాక తోకముడిచిన విషయం తెలిసిందే.

ఏవీఎస్ రెడ్డి బాటలోనే మరికొందరు ప్రముఖ సివిల్ సర్వీస్ అధికారులు తెలుగునాట రాజకీయాల్లోకి వచ్చారు. వారంతా అరవింద్ కేజరీవాల్, ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ లాగా విజయం పొందలేదు. డాక్టర్ జయప్రకాశ్ నారాయణ, జేడీ లక్ష్మీనారాయణ, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ ముగ్గురూ ఏమయ్యారు? డాక్టర్ జయప్రకాష్ నారాయణ లోక్ సత్తా అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించి మంచిపేరు తెచ్చుకొని, దాన్ని రాజకీయ పార్టీగా మార్చాక ఒకేఒక్కసారి కూకట్ పల్లి నుంచి శాసనసభకు తాను ఒక్కడే ఎన్నికై ఆ తర్వాత కాలంలో ఆ పార్టీని ఏం చేశారో అందరికీ తెలుసు. జెడి లక్ష్మీనారాయణ ఐపీఎస్ అధికారి. డాక్టర్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డిని అక్రమాస్తుల కేసులో ఆరోపణలు వస్తే విచారించి జైల్లో పెట్టినందుకు వచ్చిన పలుకుబడి, ప్రచారం తనను రాజకీయాల్లో ఎక్కడికో తీసుకుపోతుందనుకున్నారు, ఎక్కడికీ తీసుకు పోలేదు. ఆయనను చివరికి మేఘ ఇంజనీరింగ్ కంపెనీలో ఉద్యోగంలో చేర్చింది.

కవిత ఏం చింతించాల్సిన అవసరం లేదు. ఈ వరుసలో ఇంకా చాలామంది ఉన్నారు. ఆమె వదిలి వచ్చిన భారత రాష్ట్ర సమితి మీద ఇప్పుడు ఈగ కూడా వాలనివ్వని ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఎంతో ప్రజాదరణ పొందిన ఐఏఎస్ అధికారి. ప్రాంతీయ పార్టీ పెడితే పప్పులు ఉడకవన్న విషయం అర్థమై మాయావతి పార్టీ బహుజన సమాజ్ లో చేరి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఉచ్చరించలేని భాషలో నిందించి, ఇది మనవల్ల అయ్యే పని కాదని అదే పార్టీ పంచన చేరారు. కవిత చెప్పినట్టుగా ఇంకా కొంతమంది మగ రాజకీయ నాయకులు రాజకీయ గుర్రాల మీద స్వారీ చేయాలని ఉవ్విళ్ళు ఊరుతున్న మాట నిజమే. అందులో రెండు మూడుసార్లు పార్టీలు అటు ఇటు మార్చిన, మంత్రి పదవి రానందుకు తీవ్ర అసంతృప్తితో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒకరు కావచ్చు.

పురుషులైనా స్త్రీలైనా రాజకీయాల్లోకి వచ్చి సొంత పార్టీలు పెట్టుకున్న వాళ్ళందరూ విఫలమవుతారని ఏం లేదు. రాజకీయాల్లో అద్భుతంగా రాణించిన పురుషులు కూడా ఉన్నారు. అందరికన్నా పెద్ద ఉదాహరణ కెసిఆర్. ఒక ప్రాంతీయ పార్టీ స్థాపించి, అందునా ప్రత్యేక రాష్ట్రం కోసం సుదీర్ఘ కాలం ఉద్యమం నడిపి, విజయం సాధించి పదేళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పటికింకా తెలంగాణ రాజకీయాల మీద, భారత రాష్ట్ర సమితి మీద ఎవరు కాదన్నా ఆయనది చెరగని ముద్ర. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ వంటి ఒక మహా పర్వతాన్ని ఢీకొట్టి , సొంతంగా ప్రాంతీయ పార్టీ పెట్టుకొని , కేసులపాలై జైలుకు వెళ్లి కూడా విజయం సాధించిన యువ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. మహారాష్ట్రలో శరద్ పవర్ కాంగ్రెస్ ను ఎదిరించి బయటకు వచ్చి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన, అలాగే ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ జనతాదళ్ చీలిక పార్టీ బిజెడిని సమర్థవంతంగా కొన్ని దశాబ్దాలపాటు నడిపించిన చరిత్ర మన కళ్ళ ముందుంది.ఇక ప్రస్తుతానికి వస్తే కవిత ప్రారంభించబోయే కొత్త రాజకీయ పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతోంది? రాష్ట్రంలో శాసనసభకు ఎన్నికలు జరగడానికి ఇంకా దాదాపు మూడు సంవత్సరాలు సమయం ఉన్నది.

ఆనాటికి పరిస్థితులు ఎలా మారతాయన్న విషయం ఇప్పుడే జోస్యం చె ప్పడం సరైనది కాదు. కానీ రాజకీయ పరిశీలకులు ఎవరై నా ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బేరీజు వేసి, ఆయా రాజకీయపక్షాల బలాబలాలను అంచనా వేసి ఎన్నికలలో ఏం జరగవచ్చో ఊహాగానం చేస్తూ ఉంటారు, అంచనాలకు వ స్తూ ఉంటారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ మై దానం కవిత ఫుట్బాల్ ఆడుకోవడానికి ఖాళీగా ఉన్నదా? కాంగ్రెస్ అధికారంలో ఉన్నది. పదేళ్లు ప్రభుత్వం మాదేనన్న ఆత్మవిశ్వాసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో చెక్కుచెదరటం లేదు. ఇంకో పక్కన పైకి ఏం చెబుతున్నా బిఆర్‌ఎస్‌ను మింగేసి, సాధ్యపడకుంటే లొంగదీసి తెలంగాణలో అధికారం ఛేజిక్కించుకో చూస్తున్న కేంద్రంలో అధికారంలో ఉన్న బిజేపీ.. వీటి మధ్య కవిత అయినా ఇంకెవరయినా పెట్టే కొత్త పార్టీకి వచ్చే ఎన్నికలనాటికి చోటు ఏర్పడుతుందా? కన్నతండ్రితో సహా కుటుంబంలో అందరినీ కాదనుకుని చేయబోయే రాజకీయంలో కవిత గెలుస్తారా? మహిళలు రాజకీయాల్లో నిలిచి గెలవాలనే కోరుకుందాం. 

Delete Edit

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments