
మన తెలంగాణ/హైదరాబాద్/ఎర్రవెల్లి : తెలంగాణ సాధించిన కెసిఆర్‌ను పట్టుకుని కొందరు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసిఆర్ ఏ జాతికి జాతిపిత అని ఎద్దేవా చేస్తున్నారని మండిపడ్డారు. తమది రాణీ రుద్రమ, సమ్మక్క సారక్క, దొడ్డి కొమురయ్య వంటి తెలంగాణ మహాపురుషుల జాతి అని పేర్కొన్నారు. తెలంగాణ మట్టితో మమేకమైన వారికి, ఉద్యమాల ఉగ్గుపాలు తాగిన వారికి, ఆత్మగౌరవ పోరాటంలో కలిసి నడిచిన వారికి మాత్రమే జాతి అంటే ఏమిటో తెలుస్తుందని అన్నారు. కానీ, సమైక్యాంధ్ర సంచులు మోసిన వారికి జాతి గురించి ఏం తెలుస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. “మాది కెసిఆర్ లాంటి ఫైటర్ల జాతి, వారిది ద్రోహుల జాతి. నా తండ్రి తెలంగాణ జాతికి హీరో అన్న విషయం వాస్తవం. కొంతమంది కెసిఆర్ ఆనవాళ్లు చెరిపేస్తామని అంటున్నారు. తెలంగాణనే కెసిఆర్ ఆనవాళ్లు అయినప్పుడు ఎలా చెరిపేస్తారు..? ఐకమత్యంగా కలిసికట్టుగా కదం తొక్కి మళ్లీ గులాబీ జెండా ఎగరేసి కెసిఆర్‌ను సిఎం చేయడమే జన్మదినం సందర్భంగా ఇచ్చే చిరుకానుక” అని కెటిఆర్ తెలిపారు. తెలంగాణ భవన్లో మంగళవారం బిఆర్ఎస్ అధినేత, మాజీ సిఎం కెసిఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ వేడుకల్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, మాజీ మంత్రులు హరీష్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 72 కిలోల కేక్ కట్ చేసి కెటిఆర్, హరీష్‌రావు ఒకరికొకరు తినిపించుకున్నారు. కెసిఆర్ ఉద్యమ ప్రస్థానం, పదేళ్ల పాలనపై తయారు చేసిన డాక్యుమెంటరీని ప్రదర్శించారు. ఈ వేడుకలలో పార్టీ ముఖ్యనేతలు, మాజీ మంత్రులు, ఎంఎల్ఎలు, ఎంఎల్‌సిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ ఇటీవల ఓ కార్యక్రమంలో సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, కెసిఆర్‌ది ఏ జాతి, ఎవరికి జాతిపిత అంటూ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. “ఏ జాతి అనే అల్పుడికి నేను చెబుతున్నా.. రాజ్యతంత్రం నడిపిన రుద్రమ జాతి మాది.. జల్ జంగల్ జమీన్ అని కొట్లాడిన కొమురంభీం, అస్తిత్వం కోసం అమరులైన సమ్మక్క, సారక్క, కోటల మీద జెండా ఎగురవేసిన బహుజన వీరుడు సర్దార్ సర్వాయిపాపన్న, భూస్వాముల దోపిడి మీద కొట్లాడిన దొడ్డి కొమురయ్య, బరిలో బందూకు పట్టి దేశ్‌ముఖ్‌లను తరిమికొట్టిన వీరనారి చాకలి ఐలమ్మ, సామాజిక విప్లవకారుడు భాగ్యరెడ్డి వర్మ, సిపాయిల తిరుగుబాటు బావుటా ఎగురవేసిన తుర్రెబాజ్ ఖాన్, ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలోనే ఉప్పుపాతర వేస్తామన్న కాళేజీ, నా తెలంగాణ కోటి రతనాల అన్న దాశరథి, విద్యార్థి అమరవీరుల జాతి మాది” అని కెటిఆర్ ఉద్ఘాటించారు.
కెసిఆర్‌కు ప్రముఖుల శుభాకాంక్షలు
బిఆర్ఎస్ అధినేత, మాజీ సిఎం కెసిఆర్ పుట్టిన రోజు సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఎపి సిఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్, ఎపి ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఎపి మంత్రి నారా లోకేష్, రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండ సురేఖ, కేంద్రమంత్రి బండి సంజయ్, పిసిసి అధ్యక్షుడు మహేశ్ గౌడ్, మెగాస్టార్ చిరంజీవి, తదితరులు ఉన్నారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అందరికీ కెసిఆర్ ధన్యవాదాలు తెలిపారు.
ఆస్ట్రేలియాలో ఘనంగా
కెసిఆర్ జన్మదిన శుభాకాంక్షలు
బిఆర్ఎస్ అధినేత, మాజీ సిఎం కెసిఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఆస్ట్రేలియాలోని సిడ్నీ, అడిలైడ్, మెల్బోర్న్, కాన్బెర్రా, బ్రిస్బేన్,గోల్ కోస్ట్, బెండీగో, బల్లారాట్ నగరాలలో బిఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి అధ్వర్యంలో కెసిఆర్ జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు,అన్న దాన కార్యక్రమాలు చేశారు. బిఆర్ఎస్ ఆస్ట్రేలియా నాయకుడు రాజేష్ గిరి రాపోలు ఆధ్వర్యంలో వినయ్ గౌడ్ సన్నీ ఆధ్వర్యంలో రక్త దాన కార్యక్రమం నిర్వహించారు. బ్రిస్బేన్‌లో విన్నీ తుముకుంట ఆధ్వర్యంలో కెసిఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ జన్మదిన వేడుకలలో రవీందర్ చింతామణి, రాహుల్ రాంపల్లి, రవి శంకర్ దుపాటి, పరశురాం మూతుకుల్లా, సాయి గుప్తా, యుగేందర్ అల్లం, సంతోష్ రెడ్డి మాడు, శ్రీ వేకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




