Monday, March 2, 2026
Google search engine
HomeUncategorizedబంజారాలను కాంగ్రెస్ సర్కార్ మోసం చేసింది: కవిత

బంజారాలను కాంగ్రెస్ సర్కార్ మోసం చేసింది: కవిత

మనతెలంగాణ/హైదరాబాద్ : బంజారాలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాంగ్రెస్ మోసం చేసిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. బంజారాలకు, ఆదివాసీలకు ఈ ముఖ్యమంత్రి లొల్లి పెట్టిస్తున్నారని ఆరోపించారు. జిఒ 33 ప్రకారం బంజారాలకు రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆదివారం సేవాలాల్ 287వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కవిత బోగ్ బండార్ నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సేవాలాల్ సందేశం ప్రకారం జాగృతి ముందుకు వెళ్తుందని తెలిపారు. సేవాలాల్ ఆధ్యాత్మిక గురువు మాత్రమే కాదు, సంఘ సంస్కర్త కూడా అని పేర్కొన్నారు. బంజారాజాతి మేలు కోసం పోరాడిన సేవాలాల్ పాఠ్యాంశం దేశ వ్యాప్తంగా ఉండాలని డిమాండ్ చేశారు. గోర్ భోళి భాషను కచ్చితంగా 8వ షెడ్యూల్‌లో చేర్చాలని అన్నారు. తండాల్లో ఎక్కువ మంది పేదవాళ్లే ఉంటారని,గతంలో సూర్యాపేట దగ్గర ఆడబిడ్డలను అమ్ముకున్న పరిస్థితి చూశామని, ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోయినప్పటికీ పేదరికం మాత్రం ఇంకా పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

పేదరికాన్ని నిర్మూలించాలంటే ప్రత్యేక కార్యాచరణతో ప్రత్యేక ఫండ్‌ను కేటాయించాలని తెలిపారు. అన్ని పార్టీలు బంజారా శాఖను పెట్టుకుంటాయి… కానీ, జాగృతి మాత్రం మెయిన్ బాడీలోనే వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బంజారా బిడ్డకు అవకాశం ఇచ్చిందని అన్నారు. వెనుకబడిన జాతిని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. సేవాలాల్ స్వాభిమానం, సామాజిక న్యాయం ఉండాలన్నారని చెప్పారు. బంజారాలు మంచి పొజిషనల్‌లో ఉండాలని, రాజకీయాల్లో వారి ప్రాతినిధ్యం ఉండాలని ఆకాంక్షించారు. మన తండాల్లో మన రాజ్యం అని తెలంగాణ వచ్చాక చేసుకున్నామని, అయితే యువమిత్రులు తండాల్లో వెలుగులు నింపేలా నాయకత్వం చేపట్టాలని పిలుపునిచ్చారు.

ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికల్లో యువకులు పోటీ చేయాలని, నాయకులు కావాలనుకునే యువత గ్రామాల్లో ఉండాలని తెలిపారు. తండాలను గ్రామపంచాయితీలుగా చేసుకున్నప్పటికీ సరైన వసతులు మాత్రం లేవు అని, ఈ పరిస్థితి మారాలంటే ముఖ్యమంత్రి ప్రతి తండాకు రూ. 25 లక్షలు ఇవ్వాలని చెప్పారు. రాష్ట్రంలో తాము ఒక్క మున్సిపాలిటీ గెలిస్తే కాంగ్రెస్ ఆ సీటును లాక్కున్నదని మండిపడ్డారు. ఈ వెగటు రాజకీయాలు చేసే బిఆర్‌ఎస్ అధికారం కోల్పోయిందని చెప్పారు. రాష్ట్రంలో అడిగేవాళ్లు, ప్రతిపక్షం ఉండొద్దా..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు కూడా కచ్చితంగా ప్రజలు బుద్ది చెబుతారని హెచ్చరించారు. సేవాలాల్ జయంతి, శివరాత్రి సందర్భంగా ప్రజలకు కవిత శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments