
వాషింగ్టన్: మనకు అపరిచితులు అయిన గ్రహాంతరవాసులు ఉన్నారని, వీరి ఉనికిని తాను నమ్ముతున్నానని అమెరికా మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా చెప్పారు. ఎక్కడో ఓ చోట వీరి జీవనం ఉండే ఉంటుంది. అయితే అది ఎక్కడ అనేది తనకు తెలియదని మాజీ ప్రెసిడెంట్ తాజా ్రఇంటర్వూలో వెల్లడించారు. గ్రహాంతర జీవుల మనుగడ ఉందా? అనే యూట్యూబర్ బ్రెయిన్ టైలెర్ ప్రశ్నకు ఒబామా స్పందించారు. తానైతే వారిని చూడలేదని తెలిపారు. తాను నిజమేనని చెపుతున్న గ్రహాంతరవాసులను ఏరియా 51లో పెట్టి ఉంచారనేది కుట్రపూరిత వాదన అని కొట్టిపారేశారు.
ఏరియా 51 అమెరికా రహస్య వైమానిక దళం ఉండే నెవాడాలోని ఎయిర్‌బేస్. దీనికి ఏరియా 51 అనే సంకేత నామం ఉంది. అయినా ఏలియన్స్‌కు రహస్య ప్రదేశాలు అనేవి ఉండవన్నారు. ఏరియా 51కు ఎప్పుడూ గ్రహాంతరవాసులు తారసిల్లడం, యుఎఫ్‌ఒలు కన్పించడం జరుగుతుంది. అయితే ఈ విషయాన్ని అమెరికా ప్రభుత్వం ఎప్పుడూ నిర్థారించలేదు.
గ్రహాంతర జీవుల ఉనికిని నిర్థారించేందుకు ఎటువంటి నిర్థిష్ట సాక్షాధారం లేదు. దీనికి సంబంధించి ఇప్పటికీ శాస్త్రజ్ఞుల బృందాలు అంతరిక్షంలోని విస్తారిత ప్రాంతాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని వెతుకుతున్నారు. గ్రహాంతరవాసుల నుంచి అందే సంకేతాలు అత్యంత కీలకమైన సాక్షాధారం అని భావిస్తున్నారు. మాజీ ప్రెసిడెంట్ ఒబామా వ్యాఖ్యలతో తిరిగి అందరి దృష్టి ఇప్పుడు ఈ ఎలియన్స్ వైపు మళ్లింది.




