
మన తెలంగాణ/హైదరాబాద్‌ః గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తెలిపారు. గిరిజనుల సంక్షేమానికి తమ పార్టీ కట్టుబడి ఉందన్నారు. గిరిజన నాయకుడు సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు ఆదివారం బిజెపి రాష్ట్ర ఎస్‌టి మోర్చా అధ్యక్షుడు రవి నాయక్ అధ్వర్యంలో ఘనంగా జరిగాయి.
ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ప్రసంగిస్తూ ప్రస్తుతం గిరిజన ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి ఎక్కువగా కేంద్ర ప్రభుత్వ ఐటీడీఏ నిధుల ద్వారానే సాధ్యమవుతోందని తెలిపారు. సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను ప్రతి సంవత్సరం తమ పార్టీ ట్రైబల్ మోర్చా ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.
తమ పార్టీ సిద్ధాంతాలకు చేరువలో సేవాలాల్ జీవితం
సేవాలాల్ మహారాజ్ జీవితం తమ పార్టీ నమ్మే సిద్ధాంతాలకు ఎంతో దగ్గరగా ఉందని ఆయన చెప్పారు. దేశాన్ని విదేశీ శక్తుల ఆధిపత్యం నుంచి విముక్తి చేయాలనే సంకల్పంతో పాటు, ప్రకృతి-పర్యావరణ పరిరక్షణకు ఆయన జీవితాంతం అంకితమయ్యారని తెలిపారు. బంజారా సమాజానికి శ్రీ సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ ఆరాధ్య దైవమని, పర్యావరణాన్ని కాపాడే దేవుడిగా ఆయనను గిరిజన సమాజం భావిస్తుందని అన్నారు. విదేశీ పాలన కాలంలో ఒకవైపు విదేశీయులపై పోరాటం చేస్తూనే, మరోవైపు ప్రకృతి పరిరక్షకుడిగా నిలిచిన మహనీయుడు సేవాలాల్ మహారాజ్ అని ఆయన కొనియాడారు.
జగదాంబ మాత ఉపాసకుడిగా, భక్తి శ్రద్ధలతో జీవించిన సేవాలాల్ మహారాజ్ బోధనలు నేటి తరాలకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయని తెలిపారు. గిరిజనుల సంక్షేమానికి అనేక చారిత్రాత్మక నిర్ణయాలను ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్నారని ఆయన వివరించారు. గిరిజన కమిషన్ ఏర్పాటు, ప్రత్యేకంగా గిరిజన మంత్రి, గిరిజన సంక్షేమానికి అత్యధిక నిధుల కేటాయింపు వంటి కీలక నిర్ణయాలను ప్రధాని మోదీ తీసుకున్నారని ఆయన గుర్తుచేశారు.
గిరిజన విశ్వ విద్యాలయం
ములుగులో సమ్మక్క-సారలమ్మ గిరిజన విశ్వ విద్యాలయం ఏర్పాటు ద్వారా గిరిజన ప్రాంతాల్లో ఉన్నత విద్యావకాశాలు విస్తరించాయని తెలిపారు. అలాగే మహారాష్ట్రలో సేవాలాల్ మహారాజ్ మందిర నిర్మాణం చేపట్టడం గిరిజన సంస్కృతికి ఇచ్చిన గౌరవంగా ఆయన అభివర్ణించారు. ఇంకా గిరిజనుల విద్య, ఉపాధి, ఆరోగ్య సంక్షేమం కోసం అనేక పథకాలు అమలులోకి వచ్చాయని తెలిపారు. రాష్ట్రంలో గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తండాల అభివృద్ధిని నిర్లక్ష్యం చేశాయని విమర్శించారు. తండాలను గ్రామ పంచాయతీలుగా ప్రకటించినప్పటికీ, సరైన నిధులు విడుదల చేయలేదని, సంక్షేమ పథకాలు అందించలేదని రాంచందర్ రావు విమర్శించారు.
ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కళ్యాణ్ నాయక్, పార్టీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్, పలువురు సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




