
లండన్ : సామాజిక మాధ్యమానికి ఎక్కువగా అలవాటుపడితే అది మనిషిలో అల్జీమీర్స్‌కు దారితీస్తుంది. సగటు మనిషి తనను తాను మర్చిపోయే పరిస్థితి ఏర్పడుతుందని జీవనశైలి అధ్యయనకర్త ల్యూక్ కౌటినో తమ విశ్లేషణతో తెలిపారు. కోవిడ్ మహమ్మారి తరువాతి క్రమంలో మనిషి ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ఇతర మాధ్యమాలతో ఎక్కువగా ఇతరులతో అనుసంధానం లేకుండా ఒంటరితనానికి అలవాటుపడ్డాడు. ఈ విధంగా మారిన వారి సంఖ్య గణనీయంగా ఉంది. ప్రత్యేకించి పలు సామాజిక మాధ్యమాలలో వెలువడుతున్న సమాచారం, తప్పుడు వార్తలు మనిషిని విచిత్ర మానసిక స్థితికి మారుస్తున్నాయి. ఇది ఆరోగ్యపరంగా అత్యంత ప్రమాదకరమైన అల్జీమిర్స్‌కు దారితీస్తోందని తమ శాస్త్రీయ అధ్యయనంలో వెల్లడైందని ప్రకటించారు.
డిజిటల్ ప్రపంచం అందించే సమాచారంలోని నిజానిజాలను నిర్థారించుకునే క్రమంలో ఎక్కువ మంది తమ ఉనికిని తామే మరిచిపోయే విచిత్ర డోలాయమాన స్థితికి చేరుతున్నారు. వైద్యుల పరీక్షల వరకూ వెళ్లితే ఇది నయం కాని అల్జీమిర్స్ ప్రమాద ఘంటికగా నిర్థారణ అవుతోంది. దాదాపుగా ప్రతి వ్యక్తి వద్ద ఉండే స్మార్ట్‌ఫోన్లు, లాప్‌టాప్‌లు ఇతరత్రా హైటెక్ సాధనాలు చివరికి మనిషి అంతర్గత మేధ శక్తిని హరించి వేస్తున్నాయని తేల్చారు. ప్రత్యేకించి జన్మతః ఉండే స్వతహసిద్ధ ఆలోచనా విధానానికి విఘాతం ఏర్పడుతోంది. ఒంటరితనంలో తోడుగా ఉండే సోషల్ మీడియానే మిగిలిన ప్రపంచం అయ్యి వాస్తవికతకు దూరం అవుతున్నారని తేల్చారు. తాను ఇటీవలే ఓ వ్యక్తి మస్తిష్కం ఆలోచనలను పరిశీలించానని కేవలం 9 నెలల కాలంలోనే ఈ వ్యక్తికి అల్జీమీర్స్ వచ్చిందని ఈ అధ్యయనకర్త తెలిపారు. ఇది వయస్సుపరంగా వచ్చింది కాదు.
దైనందిన జీవితంలో చోటుచేసుకున్న మార్పు క్రమంలో తలెత్తిన అవలక్షణం అని విశ్లేషించారు. ఓ 50 సంవత్సరాల వ్యక్తి అంతకు ముందటి వరకూ విజయాలు సాధిస్తూ వచ్చాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, తెలివితేటలను సమయస్ఫూర్తితో చాటుకున్నాడు. అయితే ఈ వ్యక్తికి ఇటీవల తనను తాను మర్చిపోయే జబ్బు వచ్చిందని తెలిపారు. జ్ఞాపకశక్తి నిద్రాణం అవుతూ వస్తోంది. అయోమయం, చిరాకు, తప్పుడు ప్రేలాపనలకు దిగుతున్నట్లు గుర్తించామని వెల్లడించారు. ప్రత్యేకించి పలు గంటలు సామాజిక మాధ్యమంతో గడిపే వారికి ఎక్కువగా ఇటువంటి అవలక్షణం ఏర్పడుతోంది. దీనితో ఇంతకు ముందటివరకూ ఆరోగ్యవంతుడు అయిన వ్యక్తి కూడా అవలక్షణంతో తనకు తాను అపరిచితుడు అయి కుంగిపోతున్నాడని తేల్చారు.




