
న్యూఢిల్లీ : ఆర్థికంగా బలహీన వర్గానికి చెందిన ఓ 19 ఏళ్ల కుర్రాడు తాను రెండుసార్లు నీట్ పాస్ అయినప్పటికీ సీటు రాకపోయే పరిస్థితిని సుప్రీం కోర్టు దృష్టికి తీసుకు వచ్చి చివరకు విజయం సాధించగలిగాడు. ఈ విషయంలో తానే సొంతంగా సుప్రీం కోర్టులో వాదనలు వినిపించడం విశేషం. మధ్యప్రదేశ్ లోని జబల్‌పూర్‌కు చెందిన లాయర్ మనోజ్ చతుర్వేది కుమారుడు 19 ఏళ్లఅధర్వ్ చతుర్వేది రెండుసార్లు నీట్ రాసి పాస్ అయ్యాడు. 530 స్కోరు చేశాడు. ఈడబ్లుఎస్ కోటా కింద ఏదో ఒక ప్రైవేట్ కాలేజీలో సీటు కచ్చితంగా వస్తుందని ధీమా పడ్డాడు.
లాస్ట్‌రౌండ్ కౌన్సెలింగ్‌లోనూ అతడికి సీటు రాలేదు. తమ రాష్ట్రంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఈడబ్లుఎస్ కోటాను అమలు చేయకపోవడం వల్లనే తనకు అన్యాయం జరిగిందని ఆవేదన చెందాడు. మరోవైపు ఎస్సీ, ఎస్టీ , దివ్యాంగులకు సీట్లు అందుబాటులో ఉన్నాయని గుర్తించాడు. ఈ నేపథ్యంలో జనవరి 6న తానే సొంతంగా స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్‌ఎల్‌పి) తయారు చేసి దాఖలు చేశాడు. విధానపరమైన లోపాలే అతడికి సీటు రాకపోవడానికి కారణాలుగా కోర్టు గమనించింది.
ప్రైవేట్ కళాశాలల్లో ఈడబ్లుఎస్ కోటాను రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేయనందున అతని అడ్మిషన్‌ను తిరస్కరించకూడదని కోర్టు పేర్కొంది. 202526 సెషన్‌లో అతడికి అడ్మిషన్ ఇవ్వాలని ఆదేశించింది. ఈమేరకు నేషనల్ మెడికల్ కమిషన్, మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఇటీవలల ఈ పిటిషన్ విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌ను 10 నిమిషాలు సమయం ఇవ్వాలని కోరిన అధర్వ తానే సొంతంగా వాదనలు వినిపించి విజయం సాధించాడు.




