
అసెంబ్లీ ఎన్నికల వేళ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ రాష్ట్ర మహిళలకు శుభవార్త చెప్పారు. కలైంగర్ పథకం కింద రాష్ట్రంలోని 1.31 కోట్ల మంది మహిళలకు ఒక్కొక్కరికి రూ.5,000 చొప్పున వారి ఖాతాల్లో జమ చేసినట్టు తెలిపారు. ప్రభుత్వం నెలవారీ సాయం గా మహిళలకు రూ.1,000 అందిస్తోంది. అయితే ఈసారి ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల మొత్తం కలిపి రూ.3,000, సమ్మర్ స్పెషల్‌గా మరో రూ.2,000 కలిపి ఈ మొత్తాన్ని మహిళా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసినట్టు చెప్పారు. ఏప్రిల్-మే అసెంబ్లీ ఎన్నికల్లో తమ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తే మహిళా లబ్ధిదారులకు ఇస్తున్న నెలవారీ సాయం రూ.2,000కు పెంచుతామని వీడియో సందేశంలో స్టాలిన్ తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న నగదు సాయాన్ని అసెంబ్లీ ఎన్నికలు, ఎన్నికల కోడ్ పేరిట అడ్డుకునేందుకు బిజెపి, అన్నాడిఎంకె, కుట్ర పన్నుతున్నాయని స్టాలిన్ ఆరోపించారు. దీనిని దృష్టిలో ఉంచుకుని మూడు మాసాల సాయాన్ని ఒకేసారి కలిపి మహిళల ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. సమ్మర్ స్పెషల్ ఖర్చుల కింద రూ.2,000 అదనంగా ఖాతాలో జమచేసినట్టు చెప్పారు. రాబోయే మూడు నెలలు మీరు పడబోయే ఇబ్బందులతో పాటు అదనంగా మందులు, పరీక్షల సమయంలో పిల్లలకు ఖర్చులు ఎక్కడి నుంచి తెస్తారని ఆలోచించానని, ఆ కారణంగానే తమ అకౌంట్లలో రూ.5,000 జమ చేయాలని ఆదేశించానన్నారు.




