
మన తెలంగాణ/హైదరాబాద్ : శ్రీశైలం నడకదారిలో పెద్దపులి కలకలం రేపింది. మల్లన్న భక్తులను భయకంపితులను చేసింది. నల్లమల అటవీ మార్గంలో వారికి ఏకంగా ఓ పెద్దపులి ఎదురుపడింది. మార్కాపురం జిల్లా డోర్నాల మండలం పరిధిలోని పెద్దచెరువు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. శివరాత్రిని పురస్కరించుకుని శ్రీశైలానికి కాలినడకన వెళుతున్న భక్తుల బృందానికి దారి పక్కన పొదల్లో పెద్దపులి కనిపించింది.
కొద్దిసేపు భక్తులను తీక్షణంగా చూస్తూ అక్కడే నిలబడింది. అటవీశాఖ అధికారుల హెచ్చరికలతో అప్రమత్తంగా ఉన్న భక్తులు, భయంతో పరుగులు తీయకుండా నిల్చుండిపోయారు. ఇరువైపులా నిశ్శబ్దం నెలకొనగా, క్షణక్షణం ఉత్కంఠగా గడిచిం ది. కొంతసేపటికి ఆ పులి నెమ్మదిగా అడవిలోకి వెళ్లిపోవడంతో భక్తులంతా ఊపిరి పీల్చుకున్నారు. ‘శ్రీశైలం మల్లన్నే కాపాడాడు’, ‘ఓం నమశ్శి వాయ’ అంటూ భక్తితో నినాదాలు చేస్తూ తమ యాత్రను కొనసాగించారు.
ఈ ఘటనను ఓ వాహనదారుడు తన సెల్ఫోన్లో వీడియో తీశారు. అన్నదాన శిబిరానికి సరుకులు తీసుకెళుతున్న ఆయన, ఈ వీడియోను ఇతర యాత్రికులకు చూపించి వారిని అప్రమత్తం చేశారు.నల్లమల అడవి గుండా వెళ్లే యాత్రికులు గుంపులుగా వెళ్లాలని, ఒంటరిగా ప్రయాణించవద్దని అటవీ అధికారులు సూచిస్తున్నారు. ఈ ప్రాంతంలో పులుల సంచా రం సాధారణమే అయినప్పటికీ, ఇలా యాత్రికులకు ముఖాముఖి ఎదురుపడటం ఆందోళన కలిగించే పరిణామమే. అయితే, మల్లికార్జున స్వామి దయవల్లే తమకు ఎలాంటి హాని జరగలేదని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. ఊపిరి పీల్చుకున్నారు.




