
మనతెలంగాణ/హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల్లో అధికార పక్షం ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ప్రలోభాలకు గురిచేసినా మొక్కవోని దీక్షతో వీరోచితంగా పోరాడిన బిఆర్ఎస్ కార్యకర్తలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పేరుపేరునా హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ పార్టీ సాగించిన అరాచకాలు, దౌర్జన్యాలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ వరకు పురపాలక సమరంలో గులాబీ సైనికులు కనబరిచిన పోరాట స్ఫూర్తి పార్టీకి కొండంత బలాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపిందని కొనియాడారు.
గత రెండేళ్ల పాలనలో ఘోరమైన వైఫల్యాలను మూటగట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఓటమి భయంతోనే ఈ ఎన్నికల్లో దౌర్జన్యకాండకు దిగారని విమర్శించారు. ఈ మేరకు బుధవారం కెటిఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు. పంచాయతీ ఎన్నికల్లో ఎదురైన పరాభవం పట్టణాల్లోనూ తప్పదనే ఆందోళనతోనే రేవంత్ రెడ్డి అడుగడుగునా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని మండిపడ్డారు. అక్రమంగా లూటీ చేసిన వేల కోట్ల ప్రజాధనంతో ప్రజాతీర్పునే మార్చాలని చూస్తున్న కుట్రలను తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.
పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని బిఆర్ఎస్ శ్రేణులపై సాగించిన వేధింపులకు, దాడులకు రేవంత్ రెడ్డి త్వరలోనే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని పేర్కొన్నారు. ప్రజలకిచ్చిన హామీలను, పరిపాలనను పూర్తిగా గాలికి వదిలేసి రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టిన పాపం ముఖ్యమంత్రిని ప్రతినిత్యం వెంటాడుతుందని అన్నారు. ఎన్ని నిర్బంధాలు ఎదురైనా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ప్రజల పక్షాన బిఆర్ఎస్ పోరాటం నిరంతరం కొనసాగుతుందని కెటిఆర్ స్పష్టం చేశారు.
కాంగ్రెస్ కుట్రలు ప్రజల తీర్పును ప్రభావితం చేయలేవు : హరీష్రావు
ముఖ్యమంత్రి మొదలుకొని..మంత్రులు, ఎంఎల్ఎలు, కాంగ్రెస్ నాయకులు అడుగడుగునా అధికార దుర్వినియోగానికి, ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు పాల్పడటం దుర్మార్గం అని మాజీ మంత్రి, బిఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు మండిపడ్డారు. నామినేషన్ల దాఖలు మొదలు పోలింగ్ వరకూ కాంగ్రెస్ అనేక అరాచకాలకు పాల్పడటం ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధం అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను బెదిరించడమే గాక, వారిపై భౌతిక దాడులకు తెగబడటం హీనమైన రాజకీయ సంస్కృతికి నిదర్శనం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాన్ని సైతం లెక్కచేయకుండా.. అధికార పార్టీ నాయకుల అడుగులకు మడుగులొత్తిన కొందరు పోలీసుల తీరు గర్హనీయం అని పేర్కొన్నారు.
ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ ఇలాంటి నీచ రాజకీయాలకు తెగబడటం ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానించడమే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కుట్రలు, కుతంత్రాలు, డబ్బు సంచులు, దుష్ట పన్నాగాలు ప్రజల తీర్పును ఏమాత్రం ప్రభావితం చేయలేవు అని తెలిపారు. అధికార పార్టీ ఆకృత్యాలకు అదరకుండా, బెదరకుండా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం చివరి వరకు కృషి చేసిన తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇన్చార్జ్లకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. బిఆర్ఎస్పై విశ్వాసంతో తమ అమూల్యమైన ఓటు వేసిన ప్రతి ఓటరుకు హరీష్రావు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.




