
ఎన్ని ఆటంకాలు సృష్టించినా బిల్లులు ఆమోదింపజేసుకుంటాం
స్పీకర్‌ను తొలగించే సంఖ్యాబలం వాళ్లకు లేదు
పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : పార్లమెంట్ చర్చ జరగకపోతే పాలకపక్షం కన్నా విపక్ష కూటమికే నష్టదాయకమని పార్లమెంటరీ వ్యవహారా మంత్రి కిరెణ్ రిజిజు అన్నారు. వాళ్లు ఎన్ని ఆటంకాలు సృష్టించినా బడ్జెట్ సహా తాము అనుకున్న బిల్లులను ఆమోదింపజేసుకుంటామన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ప్రతి అంశంపై చర్చ జరిగిన తరువాతనే బిల్లులకు సభ ఆమోదం తీసుకోవాలని భావిస్తోందని, దానికి విపక్షాలు సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదన్నారు.
సోమవారం పార్లమెంట్ ప్రాంగణంలో రిజిజు మీడియాతో మాట్లాడారు. స్పీకర్ ఓంబిర్లాపై అవిశ్వాస తీర్మానం తీసుకువచ్చి ఆయనను పదవి నుంచి తొలగించాలన్న విపక్షాల నిర్ణయం అయ్యే పనికాదని, అందుకు తగిన సంఖ్యాబలం వారికి లేదన్నారు. సభాపతిర, అధికారుల టేబుల్‌పైకి కూడా ఎక్కి నిరసన తెలపడం ద్వారా విపక్షం స్పీకర్ వ్యవస్థను అవమానించిందన్నారు. ఆ తర్వాతే ప్రభుత్వం సూచన మేరకు స్పీకర్ కఠిన చర్యకు ఉపక్రమించారని, సభ నుంచి 8మందిని సస్పెండ్ చేశారని గుర్తు చేశారు. విపక్షం డిమాండ్ చేస్తున్నట్లుగా అన్ని అంశాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రిజిజు అన్నారు.




