
మన తెలంగాణ/హైదరాబాద్‌ః మహిళా రిజర్వేషన్లను కల్పించి 2029 సంవత్సరంలో జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సమాయత్తమవుతోందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అంఛనా. మున్సిపల్ ఎన్నికల ప్రచార ఘట్టం సోమవారం సాయంత్రం ముగిసిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
విలేకరుల సమావేశం ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి కొంత సేపు విలేకరులుతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. తమ ప్రభుత్వ గడువు 2028 డిసెంబర్‌లో ముగిసినా, ఆ తర్వాత 2029 సంవత్సరంలో జమిలి ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్నారు. వన్ నేషన్, వన్ ఓట్‌తో పాటు మహిళా రిజర్వేషన్లూ వచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు. జిల్లాల విభజన గురించి ప్రశ్నించగా, దేశ వ్యాప్తంగా జనగణన జరుగుతున్నందున 2027 వరకూ జిల్లాల మార్పులు, చేర్పులు చేయరాదని కేంద్రం సర్కులర్ జారీ చేసిందని ఆయన తెలిపారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కె. కవిత తన కుటుంబ తగాదాలతో తనకు ఏ మాత్రం సంబంధం లేదన్నారు. పొరుగు రాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్‌లో, బీహార్, ఉత్తర్ ప్రదేశ్ తదితర ఐదు, ఆరు రాష్ట్రాల్లో రాజకీయంగా ముఖ్య నేతల కుటుంబాల్లో తగాదాలు ఉన్నాయని, వాటన్నింటికీ తనకు సంబంధమా? అని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా అన్నారు. కవిత మిమ్మల్ని కొంచం మెత్తగా, కెటిఆర్‌ను ఘాటుగా విమర్శిస్తున్నారు కదా? అని ప్రశ్నించగా, ‘మీకు ఏమైనా బాధ కలుగుతున్నదా?’ అని సిఎం ఎదురు ప్రశ్నించడంతో అందరూ నవ్వారు.
కవిత చేసే వ్యాఖ్యలను రాజకీయంగా మీరు అనుకూలంగా వాడుకోవచ్చు కదా? అని ప్రశ్నించగా, కెసిఆర్ కుటుంబ సభ్యులంతా కలిసి ఉన్నప్పుడే తాను వారిని మట్టికరిపించానని, విడిపోయాక ఇక సమస్య ఏముందన్నారు. రేవంత్‌దుద్దీన్ అనే విమర్శ గురించి మరో విలేకరి ప్రస్తావించగా, రేవంత్ యాదవ్ అని, రేవంత్ మాదిగ అని ఇలా అన్ని కులాల వారు తనను కలుపుకున్నారని, అయితే ఆచార్యుల వారు ఒక్కరే మిగిలారని ఆయన నవ్వుతూ చెప్పారు.
జిహెచ్‌ఎంసి పదవీ కాలం ఈ నెల 10న ముగియనున్నందున, తర్వాత మూడు కార్పొరేషన్లుగా చేయబోఉన్నారా? అని ప్రశ్నించగా, మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తి కానీయండి అని అన్నారు. జెడ్‌పిటిసి, ఎంపిటిసి ఎన్నికల గురించి, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల గురించి ప్రశ్నించినప్పుడు కూడా ఆయన ఇదే సమాధానమిచ్చారు.
మీరు హార్వర్డ్ వెళ్ళినా, హార్డ్-వర్డ్ మాట్లాడడం మానుకోలేదన్న విమర్శ ఉందని మరో విలేకరి చెప్పగా కొన్ని సందర్భాల్లో, రాజకీయ ప్రసంగాల్లో అలా మాట్లాడాల్సి వస్తుందని, విలేకరుల సమావేశంలో ఎక్కడైనా ఒక్క పదమైనా అనుచితంగా ఉందా? అని ఆయన ఆ విలేకరిని ఎదురు ప్రశ్నించారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఎన్ని స్థానాల్లో గెలుస్తుందో తాను ముందుగానే జర్నలిస్టులకు చెప్పానని, ఎప్పుడైనా తన అంఛనా తప్పలేదని అన్నారు.
అయితే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల గురించి కూడా చెప్పాలని అడగా, తాను ఇంకా అంచనా వేయలేదని ముఖ్యమంత్రి సమాధానమిచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కేసులో కెసిఆర్‌పై సిబిఐ విచారణ జరగకుండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నందుకే జాప్యం జరుగుతున్నదని విమర్శించిన మీరు ఫోన్ ట్యాపింగ్ కేసులో జాప్యం చేయలేదా? అని ప్రశ్నించగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావును అమెరికా నుంచి రాకుండా ఇరవై నెలలు అడ్డుపడింది ఎవరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎదురు ప్రశ్నించారు.




