
ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని వినమ్రంగా అభ్యర్థించడానికి వచ్చాను, కేంద్ర ఎన్నికల కమిషన్‌కి ఈ విషయంలో ఆరు లేఖలు రాసినా స్పందన లేని కారణంగా మీ తలుపులు తట్టాల్సి వచ్చింది. అక్షర దోషాలు ఉన్న కారణంగానో, మరే చిన్న చిన్న పొరపాట్ల వల్లనో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ ఐఆర్) పేరుతో కొద్దిమాసాల్లో ఎన్నికలు జరగనున్న తమ రాష్ట్రంలో ఒక కోటి నలభై లక్షల మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి అక్రమంగా తొలగించారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్‌కి బుధవారం నాడు మొర పెట్టుకొన్నప్పటి మాటలు ఇవి. భారత దేశ చరిత్రలో బహుశా ఒక ముఖ్యమంత్రి ఇట్లా దేశ అత్యున్నత న్యాయస్థానానికి తన సమస్యను విన్నవించుకోడానికి స్వయంగా హాజరయిన సంఘటన ఇదే ప్రథమం.
సుప్రీంకోర్టులో నల్లకోటు ధరించి తనకు ఐదు నిమిషాలు సమయం ఇవ్వండి, ప్రజాస్వామ్యాన్ని రక్షించండి అని మమత వేడుకుంటున్న సమయంలోనే రాజ్యసభలో ప్రముఖ నటుడు ఎంఎన్‌ఎం పార్టీ తరఫున డిఎంకె మద్దతుతో రాజ్యసభ సభ్యుడైన కమలహాసన్ తన తొలి ప్రసంగం చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని తూర్పారపడుతున్నారు. ఎన్నికల కమిషన్ ఎస్‌ఐఆర్ పేరిట ఒక వ్యాధిని దేశమంతా విస్తరింప చూస్తున్నదని, దానిని కట్టడి చేయవలసిన బాధ్యత ప్రజాప్రతినిధులుగా మనందరి మీద ఉన్నదని అన్నారు. ఇప్పటికే బీహార్ రాష్ట్రంలో అనేక మంది సజీవ మృతులు ఉన్నారని, తమిళనాడులో కూడా ఒక కోటి మంది పేర్లను ఓటర్ల జాబితాలో నుంచి తొలగించి వారిని కూడా సజీవ మృతుల్ని చేసే పనిలో ఎన్నికల సంఘం ఉందని ఆయన సభ దృష్టికి తెచ్చారు. కమలహాసన్ మాట్లాడేందుకు ఆయన పేరు పిలిచేటప్పుడు సభాధ్యక్ష స్థానంలో ఉన్న ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశాక ఆయన
తొలి ప్రసంగం కాబట్టి పూర్తిగా విందాం అన్నందుకేమో కమలహాసన్ కొద్ది సేపే అయినా తన ప్రసంగంలో చాలా పదునైన భాష వాడినప్పటికీ ఎవరూ అభ్యంతర పెట్టలేదు. శాశ్వతంగా అధికారంలో ఉండాలని ఏ ప్రభుత్వము కోరుకోకూడదు, అది ప్రపంచంలో ఎవరికీ సాధ్యపడలేదు అని కమలహాసన్ హెచ్చరించారు. ఓ పక్క సుప్రీంకోర్టులో మమతా బెనర్జీ ప్రజాస్వామ్యాన్ని రక్షించండి అని గౌరవ న్యాయమూర్తులను వేడుకుంటున్న సమయంలోనే రాజ్యసభలో కమలహాసన్ మాట్లాడిన మాటలు కాకతాళీయమే అయినా ఇవాళ మన చట్టసభల పరిస్థితికి అద్దం పట్టే విధంగా ఉన్నాయని అనడంలో సందేహం లేదు. చట్ట సభల్లో ఇక న్యాయం దక్కే పరిస్థితి లేదని భావించినందువల్ల మమతా బెనర్జీ న్యాయస్థానం వైపు చూస్తుంటే కమలహాసన్ మాత్రం ఇంకా చివరి ఆశతో పార్లమెంట్‌ను వేడుకుంటున్నట్టు ఆయన మాటలను బట్టి అర్థం అవుతుంది.
మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉన్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో, కమలహాసన్ రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న తమిళనాడు రాష్ట్రంలో కొద్ది మాసాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో కూడా స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ పేరిట పెద్ద సంఖ్యలో ఓటర్లను తొలగించే పని జరుగుతున్న ఫిర్యాదు కొంతకాలంగా వినిపిస్తూనే ఉన్నది. లోకసభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ దీన్నొక ఉద్యమంగా తీసుకుని ప్రచారం చేస్తున్నారు. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేందుకు అవసరం అయిన స్థానాలు లోకసభలో లభించనప్పటికీ మిత్రపక్షాలను కలుపుకొని ప్రభుత్వాన్ని నడుపుతున్న బిజెపి రాష్ట్రాలను కైవసం చేసుకోవడానికి ఈ ఎస్‌ఐఆర్‌ను ఎన్నికల సంఘం ద్వారా ప్రయోగిస్తున్నదన్నది ప్రతిపక్షాల అభియోగం.
ఇటీవల జరుగుతున్న కొన్ని పరిణామాలు ముఖ్యంగా బుధవారం నాడు మమతా బెనర్జీ సుప్రీంకోర్టు మెట్లు ఎక్కిన పరిస్థితి చూస్తుంటే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని గర్వంగా చెప్పుకునే భారత దేశంలో చట్టసభల ప్రాముఖ్యత పూర్తిగా తగ్గిపోతున్నదా అన్న సందేహం కలగక మానదు. మమతా బెనర్జీ మామూలు వ్యక్తి కాదు, ఆమె ఈ దేశంలోనే ఒక బలమైన రాజకీయ పార్టీకి అధ్యక్షురాలు. 34 సంవత్సరాల వామపక్ష పరిపాలనకు చరమగీతం పాడి 2011 నుండి పశ్చిమ బెంగాల్లో వరుసగా మూడుసార్లు అధికార పగ్గాలు చేపట్టిన నాయకురాలు. ఆమె నాయకత్వంలోని ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ దేశంలోని పలు రాష్ట్రాలలో విస్తరించి ఉన్నది. 2011లో ముఖ్యమంత్రి కావడాని కంటే ముందు నాలుగు సార్లు ఆమె పివి నరసింహారావు, అటల్ బిహారీ వాజ్‌పేయి, డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రభుత్వాలలో మంత్రిగా పనిచేసి ముఖ్యమైన శాఖలు నిర్వహించారు. ఇటు కాంగ్రెస్‌ను, అటు వామపక్షాలను పశ్చిమబెంగాల్ సరిహద్దులకు పరిమితం చేసిన మమతా బెనర్జీకి ప్రస్తుతం లోకసభలో 28 మంది సభ్యులు, రాజ్యసభలో మరో 13 మంది సభ్యులు ఉన్నారు. ఇంత శక్తిమంతురాలైన మమతా బెనర్జీ ఈ సమస్యను దేశ అత్యున్నత న్యాయస్థానం ముందటికి ఎందుకు తీసుకుపోవాల్సి వచ్చింది. చట్టాలు చేసేది పార్లమెంట్ కదా, ఇటువంటి విషయాలన్నీ అక్కడ చర్చించి పరిష్కారం చేయాలి కదా? కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పడేది పార్లమెంట్ చేసే చట్టం ద్వారానే, అటువంటి వ్యవస్థలో లోటుపాట్లను సరిదిద్ది దేశ ప్రజలందరికీ న్యాయం చేయవలసిన పార్లమెంటులో అది జరగడం లేదనే కదా మమతా బెనర్జీ న్యాయస్థానం మెట్లు ఎక్కారు.
ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వానికి అయ్యే ప్రజాధనం వ్యయం కాక వివిధ పార్టీల ఎన్నికల ఖర్చు 2024లో రూ. లక్షా 35 వేల కోట్లకు చేరినట్టు సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ అనే ఒక సంస్థ చేసిన సర్వేలో వెల్లడి అయింది. ఇట్లా ఏర్పాటైన పార్లమెంట్లో పోనీ ప్రజాసమస్యల మీద సజావుగా చర్చ జరుగుతున్నదా, ప్రజోపయోగమైన చట్టాల రూపకల్పన జరుగుతున్నదా అంటే అది కూడా జరగడం లేదని స్వయంగా లోకసభ స్పీకర్ అంగీకరిస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం చూసినా భారత పార్లమెంట్ నిర్వహణకు నిమిషానికి రెండున్నర లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే ఒక గంట సేపు పార్లమెంటు సమావేశం అయితే కోటిన్నర రూపాయల ప్రజాధనం వ్యయం అవుతుంది. ఇక భద్రతకు సంబంధించిన ఖర్చు, సిబ్బంది జీతభత్యాలు మొదలయిన ఖర్చులు వేరు. పార్లమెంట్ సమావేశమయిన సమయంలో అర్థమంతమైన చర్చలు జరిగాయా, ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు ఏమైనా జరిగా అనే విషయంతో సంబంధం లేకుండా జరిగే ఖర్చు ఇది.
గత సోమవారం నాడు సభను వాయిదా వేస్తూ లోకసభ స్పీకర్ ఓం బిర్లా స్వయంగా ప్రకటించినట్టు 19గంటల సభా సమయం వృథా అయింది. అంటే గంటకు కోటిన్నర రూపాయల చొప్పున 19 గంటలకు సుమారు 30 కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అయినట్టే కదా. ఇందుకెవరు బాధ్యులు? సభ నిర్వహణలో కీలక సహకారం అందించవలసిన అధికార ఎన్‌డిఎ, ఆ కూటమికి నేతృత్వం వహిస్తున్న బిజెపి బాధ్యత వహించాలా? ప్రధాన ప్రతిపక్ష నాయకుడికే మాట్లాడటానికి అవకాశం ఇవ్వలేదు అంటూ సభలో నిరసనలు వ్యక్తం చేసి సభా కార్యక్రమాలను స్తంభింప జేసిన ప్రతిపక్ష యుపిఎ కూటమి, ఆ కూటమికి సారథ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఖాతాలో వేయాలా? కోట్లాది రూపాయల వ్యయం జరుగుతున్నా ఫలితం లేదని బాధపడాలా?
ఇదిలా ఉంటే బహుశా మన దేశ పార్లమెంట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భద్రతా కారణాల దృష్ట్యా ప్రధానమంత్రిని పార్లమెంటుకు రావద్దని తాను సూచించినట్టు లోకసభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించడం మన పార్లమెంట్లో పరిస్థితికి అద్దం పడుతున్నది. కాంగ్రెస్ సభ్యులు ప్రధాని స్థానాన్ని చుట్టుముట్టి ఏదైనా ఊహించని చర్యకు పాల్పడే ప్రమాదం ఉందని తనకు కచ్చితంగా సమాచారం ఉన్నందున ఆయనను సభకు రావద్దని తాను కోరినట్టు స్పీకర్ చెప్పారు. అంతకు ముందు బుధవారం నాడు కొందరు మహిళా ప్రతిపక్ష ఎంపిలు బ్యానర్లు పట్టుకొని ప్రధాని స్థానం వైపు దూసుకు రావడంతో సభలో ఆందోళన మొదలైంది, అలాగే స్పీకర్ పోడియం వద్ద కూడా ప్రతిపక్ష సభ్యులు దూసుకు రావడంతో సభ వాయిదా పడింది. సభలో ఇటువంటివి జరగడం సర్వసాధారణం. ప్రతిపక్షంలో ఉన్న మన ప్రజాప్రతినిధులు ప్రధాన మంత్రి మీదనే దాడి చేసేంత స్థితికి దిగజారారని సాక్షాత్తు సభాధ్యక్షుడే నమ్మడం విచారకరం. సభకు అధిపతి అయిన స్పీకర్ ప్రధానమంత్రికి రక్షణ కల్పించలేనని అశక్తత వ్యక్తం చేయడం మన పార్లమెంటు ఎట్లా నడుస్తున్నదో అర్థమైంది.
రాజకీయంగా అభిప్రాయ భేదాలు వ్యక్తం కావడం అంశాల వారీగా చర్చించుకోవడం ఒకానొక స్థితిలో అవి కొంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడే విధంగా సాగడం సహజమే కానీ భౌతికంగా, అదీ సభలో హాని చేసే స్థితికి మన గౌరవ ప్రజాప్రతినిధులు వెళ్తారని సభాధ్యక్షుడు స్వయంగా ప్రకటించడం దిగ్భ్రాంతి కలిగిస్తున్నది. సభలోపలా, వెలుపలా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఉండే స్నేహ వైరుధ్యానికి సంబంధించి మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి స్వయంగా చెప్పిన రెండు సంఘటనలను జ్ఞాపకం చేసుకోవాలి. జవహర్ లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో వాజ్‌పేయి యువ లోకసభ సభ్యుడు. ఒకసారి సభలో చర్చ సందర్భంగా ఆయన ప్రధాన మంత్రి నెహ్రూను ఉద్దేశించి మీలో ఇద్దరు వ్యక్తులున్నారు, ఒకరు చర్చిల్ అయితే మరొకరు చెంబర్లిన్ అన్నారట. సభ ముగిసాక సాయంకాలం ఒక విందులో కలిసినప్పుడు నెహ్రూ వాజ్‌పేయి భుజంతట్టి సభలో ఈ రోజు జోర్దార్‌గా మాట్లాడారు మీరు అని ప్రశంసించారట. తరువాత చాలా కాలానికి పివి నరసింహా రావు ప్రధాన మంత్రిగా ఉన్న కాలంలో ప్రతిపక్ష నేతగా ఉన్న వాజ్‌పేయిని కశ్మీర్ సమస్య మీద చర్చ జరగనున్న జెనీవా మనవ హక్కుల సదస్సుకు భారత దేశం తరఫున హాజరయ్యే అధికార ప్రతినిధి బృందానికి నాయకుడిని చేసి పంపారట. ఆ సదస్సుకు హాజరయిన ఇతర దేశాల ప్రతినిధులు ఈ అంశాన్ని ఒక విశేషంగా చెప్పుకున్నారని వాజ్‌పేయి స్వయంగా చాలా చోట్ల చెప్పేవారు.
ఇంత సామరస్య వాతావరణం ఉంటే మమత సుప్రీంకోర్టు మెట్లెక్కే అవసరం ఎందుకొచ్చేది? ఇదంతా దేశం చూస్తున్నది. కమలహాసన్ రాజ్యసభలో తన తొలి ప్రసంగం చివర్లో చెప్పినట్టు జెన్ జీ ఈజ్ వాచింగ్ అజ్ (భావి భారత పౌరులు మనను గమనిస్తున్నారు).





