
మన తెలంగాణ/సిటీ బ్యూరో: నేపాలీ ముఠా మరోసారి హైదరాబాద్‌లో భారీ చోరీ చేసింది. వాచ్‌మెన్‌కు మత్తుమందు ఇచ్చి యజమాని ఇంట్లోని రూ.20లక్షల విలువైన బంగారు ఆభరణాలు, వజ్రాలను ఎత్తుకుని వెళ్లారు. ఈ సంఘటన గురువారం రాత్రి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నందగిరి హిల్స్‌లో జరిగింది. పోలీసులు కథనం ప్రకారం… నందగిరిహిల్స్‌లోని ఓ ఇంట్లో నేపాల్‌కు చెందిన భువన్ అనే వ్యక్తి 15 రోజుల క్రితం వంటమనిషిగా చేరాడు. ఇంట్లో పనిచేస్తూనే యజమానికి సంబంధించిన ఆభరణాలు, వజ్రాలు, విలువైన వస్తువులు ఎక్కడ పెడుతున్నాడో గమనించాడు. ఈ క్రమంలోనే ఇంటి యజమానులు లేని సమయం చూసి మరో ముగ్గురు నేపాలీలతో కలిసి భారీ చోరీ చేశాడు. గురువారం ఇంటి యజమానులు ఫంక్షన్‌కు వెళ్లడంతో ఇదే అదునుగా భావించిన భువన్ ఇంట్లో పనిచేస్తున్న వారికి తన పుట్టిన రోజు అని చెప్పి స్వీట్‌లో మత్తుమందు కలిపి ఇచ్చాడు.
ఇది తిన్న వాచ్‌మెన్‌తోపాటు మిగతా పనివారు నిద్రలోకి జారుకోవడంతో మరో ముగ్గురు నేపాలీలను ఇంట్లోకి చొరబడి లాకర్‌లో ఉన్న బంగారు ఆభరణాలు, వజ్రాలను ఎత్తుకుని పారిపోయారు. మత్తులో నుంచి పనివారు తేరుకున్న తర్వాత విషయం గ్రహించి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి చెరుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు నందగిరి హిల్స్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వరకు సిసి టివిల ఫుటేజ్‌ను పరిశీలించారు. నలుగురు నేపాలీలు చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. చోరీ చేసిన నేపాలీ ముఠాను పట్టుకునేందుకు పోలీసులు నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు. దొంగల కదలికలను గుర్తించేందుకు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.




