
భారత్- అమెరికా మధ్య గత కొన్ని నెలలుగా సన్నగిల్లుతున్న ద్వైపాక్షిక సంబంధాలు మళ్లీ బలోపేతమయ్యేలా ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి ముందడుగు పడటం హర్షించదగిన పరిణామం. రష్యానుంచి చమురు కొనుగోలు చేస్తూ, ఆ దేశం ఉక్రెయిన్‌పై యుద్ధం సాగించడానికి పరోక్షంగా సాయపడుతోందన్న అక్కసుతో భారత్‌పై అధిక సుంకాలు విధించిన అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ భారత్‌తో వాణిజ్య ఒప్పందానికి అంగీకరిస్తూ, తాము విధించిన ప్రతీకార సుంకాలను తగ్గించుకుంటున్నామంటూ తాజాగా చేసిన ప్రకటన ఒక విధంగా భారత్‌కు కాస్త ఊరట కలిగించే అంశమే. ఒకవైపు ఇతర దేశాలతో వాణిజ్య ఒప్పందాలను ఖరారు చేసుకుంటూనే, మరోవైపు అమెరికాతో వాణిజ్య చర్చలలో దృఢమైన వైఖరిని కనబరిచినందుకు ఇది భారత్‌కు దక్కిన విజయంగా అభివర్ణించవచ్చు. ట్రంప్ ప్రకటన నేపథ్యంలో ఇప్పటివరకూ భారత ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న 50 శాతం సుంకాలు ఇకపై 18 శాతానికి తగ్గుతాయి. రష్యానుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు విధించిన 25 శాతం అదనపు సుంకాలను సైతం ఉపసంహరించుకుంటామన్న ట్రంప్ హామీతో, ఇండో -పసిఫిక్ ప్రాంతంలో అమెరికా అతి తక్కువ పన్నులు విధించే దేశాల జాబితాలో ఇండియా చేరినట్లయింది.
పదిరోజుల క్రితం భారత్- ఐరోపా యూనియన్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఒక విధంగా ట్రంప్‌ను పునరాలోచనలోకి నెట్టిందని చెప్పవచ్చు. ప్రపంచ జిడిపిలో 25 శాతానికి, వాణిజ్యంలో మూడో వంతుకు ప్రాతినిధ్యం వహించే ఈ ఒప్పందాన్ని ‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’ గా దేశదేశాలన్నీ ప్రస్తుతిస్తున్నాయి. ఇది అమలులోకి వస్తే అమెరికా అధిక సుంకాల ప్రభావం భారత్‌పై అంతగా ఉండకపోవచ్చు. అమెరికా సుంకాల వల్ల భారత్‌కు కలిగే నష్టాలను భర్తీ చేసే స్థాయిలో ఈ ఒప్పందం ఉండటమే ఇందుకు కారణం. పైపెచ్చు మరో రెండు నెలల్లో కెనడాతో భారత్ కుదుర్చుకోబోయే పాతిక వేల కోట్ల రూపాయల విలువైన యురేనియం ఒప్పందం సైతం ట్రంప్‌ను కంగారు పెట్టి ఉండవచ్చు. ఇవి చాలవన్నట్లు పలు దక్షిణ అమెరికా దేశాలతోనూ భారత్ వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇవన్నీ కార్యరూపం దాల్చితే, భారత్‌పై తాము విధించిన అధిక సుంకాల ప్రభావం ఉండకపోగా, ఆసియాలో కీలక మిత్రదేశమైన భారత్.. అమెరికాకు దూరమయ్యే ప్రమాదం ఉంది. అదే జరిగితే ఆసియాలో చైనా ప్రాబల్యానికి ముకుతాడు వేయడం సాధ్యం కాకపోవచ్చు. ఇవన్నీ ఆలోచించిన మీదట ట్రంప్ దిగిరాక తప్పలేదు. ఐరోపా యూనియన్‌తో చారిత్రాత్మకమైన ఒప్పందాన్ని కుదుర్చుకోవడం ద్వారా తిరుగులేని దౌత్యనీతిని కనబరచిన భారత్, అగ్రరాజ్యంతో కోరి తగవు కొనితెచ్చుకోకుండా చివరివరకూ సంయమనం పాటించింది.
రష్యా చమురు కొనుగోలు చేయొద్దన్న అమెరికా హూంకరింపులకు తలవంచినట్లే వంచిన భారత్, ఇప్పుడు వెనెజువెలా చమురును చౌకగా కొనుగోలు చేసేందుకు అమెరికాతో బేరసారాలు ఆడబోతోంది. వెనెజువెలాను తన గుప్పిట్లో పెట్టుకున్న అమెరికాకు ఆ దేశ చమురును విక్రయించడం తలనొప్పిగా మారింది. భారత్ తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా వెనెజువెలా చమురును భారత్‌కు విక్రయించవచ్చన్నది ట్రంప్ ఆలోచన కాగా, వీలైనంత చౌకగా కొనుగోలు చేయాలన్నది భారత్ ఎత్తుగడ. అయితే తాజా వాణిజ్య ఒప్పందం పూర్తిగా భారత్‌కు అనుకూలమా అంటే కాదని నిస్సందేహంగా చెప్పవచ్చు.
ప్రస్తుతానికి ఈ ఒప్పందంలోని వివరాలేమీ ఇంకా వెల్లడికాకపోయినా, అమెరికా దిగుమతులపై సుంకాలేమీ విధించకూడదన్న షరతుకు భారత్ అంగీకరించినట్లు ట్రంప్ ప్రకటించడం, దీనిపై ప్రధాని మోడీ స్పందించకపోవడం కొంతమేరకు ఆందోళన కలిగించే అంశం. ఏటా 500 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తుల కొనుగోళ్లకు భారత్ సంసిద్ధత వ్యక్తం చేసినట్లు కూడా ట్రంప్ చెబుతున్నారు. అదే జరిగితే, వ్యవసాయం, ఇంధనం, టెక్నాలజీ వంటి కీలక రంగాల్లో దేశీయ ప్రయోజనాలు దెబ్బతింటాయనడంలో సందేహం లేదు. మరీ ముఖ్యం గా అమెరికా వ్యవసాయోత్పత్తులు ముంచెత్తితే గ్రామీణ భారతం అతలాకుతలమయ్యే ప్రమాదం లేకపోలేదు. దేశ జనాభాలో 50% ప్రజానీకానికి వ్యవసాయమే జీవనాధారమనే సంగతి గమనార్హం. తన దౌత్యనీతి ద్వారా వాణిజ్య ఒప్పందానికి అమెరికా దిగివచ్చేలా చేయడం భారత్ విజయమయితే, తమ ఉత్పత్తులపై సుంకాలు విధించకుండా భారత్ తలవొగ్గేలా చేయడం అమెరికా సాధించిన విజయమని చెప్పాలి.




