
వడోదర: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్లూపిఎల్) సీజన్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఢిల్లీ ఏడు వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్ టీమ్‌ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ఓపెనర్ బేథ్ మూనీ అద్భుత బ్యాటింగ్‌తో జట్టును ఆదుకుంది. కీలక ఇన్నింగ్స్ ఆడిన మూనీ 6 ఫోర్లతో 62 పరుగులు సాధించింది. జార్జియా వరెహమ్ (35) తనవంతు పాత్ర పోషించింది.
తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 15.4 ఓవర్లలోనే కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఢిల్లీకి ఓపెనర్లు లిజెల్లి లీ, షఫాలీ వర్మ మెరుపు ఆరంభాన్ని అందించారు.లీ 24 బంతుల్లోనే 43, షఫాలీ 21 బంతుల్లో 31 పరుగుల చేశారు. లౌరా వాల్వర్డ్ 32 (నాటౌట్) మెరుపులు మెరిపించారు. ఇక కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన జెమీమా రోడ్రిగ్స్ 23 బంతుల్లోనే 41 పరుగులు చేసి తనవంతు సహకారం అందించింది. గురువారం జరిగే ఫైనల్లో బెంగళూరుతో ఢిల్లీ తలపడుతుంది.




