
మున్సిపల్ ఎన్నికల కారణంగా విచారణను వాయిదా వేసి, మరో తేదీని ఇవ్వండి
160 సిఆర్సిపి కింద ఒకే ప్రాంతంలో విచారణను చేయాలన్న నిబంధనలు లేవు
నన్ను ఎర్రవల్లిలో విచారణ చేయండి
సిట్ విచారణ అధికారికి కెసిఆర్ లేఖ
మనతెలంగాణ/హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు రావాలని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఇచ్చిన నోటీసులకు భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మాజీ సిఎం కెసిఆర్ స్పందించారు. ఈ మేరకు గురువారం రాత్రి సిట్ విచారణ అధికారి ఎసిపి పి.వెంకటగిరికి కెసిఆర్ లేఖ రాశారు. శుక్రవారం విచారణకు హాజరు కాలేనని సిట్ అధికారులకు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల కారణంగా విచారణను వాయిదా వేయాలని కోరారు.
మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లకు శుక్రవారం(జనవరి 30) చివరి తేదీ అయినందున మున్సిపల్ ఎన్నికల పనుల్లో బిజీగా ఉన్నానని, విచారణకు శుక్రవారం కాకుండా మరో తేదీని తెలపాలని అన్నారు. మున్సిపల్ ఎన్నికలు పార్టీ గుర్తుల మీద జరుగుతున్న నేపథ్యంలో అభ్యర్థుల జాబితా ఖరారు పనిలో ఉన్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విచారణను వాయిదా వేయాలని సిట్ అధికారులను కోరారు.
మాజీ ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా, భాధ్యతగల దేశ పౌరుడిగా విచారణకు పూర్తిగా సహకరిస్తానని కెసిఆర్ వెల్లడించారు. సెక్షన్ 160 సిఆర్సిపి కింద విచారణను ఒకే ప్రాంతంలో చేయాలన్న నిబంధనలు లేవని పేర్కొన్నారు. తనను ప్రస్తుతం ఉంటున్న ఎర్రవల్లిలోని నివాసంలోనే విచారణ చేయాలని, భవిష్యత్తులో నోటీసులన్నింటిని ఎర్రవల్లిలోని తన నివాసానికే పంపాలని కెసిఆర్ కోరారు.




