
మన తెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ నేత, హుజురాబాద్ ఎంఎల్‌ఎ పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కరీంనగర్ జిల్లాలోని వీణవంకలో గురువారం అదుపులోకి తీసుకుని సైదాపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం, దుర్భాషలా డం, దౌర్జన్యం చేయడం వంటి అభియోగాలపై అతనిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. గురువారం కరీంనగర్ జిల్లా వీణ వంక లోకల్ సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్తుంటే పోలీసులు తమను అడ్డుకున్నారని తన కుటుంబంతో కలిసి హుజరాబాద్‌లో రోడ్డుపై ఎంఎల్‌ఎ పాడి కౌశిక్ రెడ్డి బైఠాయించారు. రోడ్డుపై బైఠాయించిన పాడి కౌశిక్ రెడ్డి, బిఆర్‌ఎస్ కార్యకర్తలను తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
ఈ క్రమంలో కౌశిక్ రెడ్డి పోలీసులపై రెచ్చిపోయారు. పోలీసుల మీదకు దూసుకెళ్లి బెదిరించారు. ‘భవిష్యత్తులో రేపు మీ కంటే పెద్ద పొజిషన్‌లో ఉంటా. మీ కంటే ఎక్కువ పవర్ నాకు ఉంటుంది. నా ఇంట్లో పండగ లేకుండా చేస్తున్నారు. నాపైన ఎన్ని కేసులైనా పెట్టుకోండి. బిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్కొక్కని సంగతి చూస్తా. వీణవంకలో సమ్మక్క పండగ చేసుకోకుండా అడ్డుకున్నారు’ అని సిఐకి వార్నింగ్ ఇచ్చారు. కరీంనగర్ సిపి పైన కూడా పాడి కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు.




