
న్యూఢిల్లీ : ఇంతకు ముందు రైతులను మోసం చేసినట్లే, ఇప్పుడు కూలీలకు కూడా కేంద్ర ప్రభుత్వం ద్రోహం చేస్తుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. దేశంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామి పథకం (ఎంజిఎన్ఆర్ఇజిఎ)ను ఎత్తివేయడం వెనుక భారీ స్థాయి అన్యాయం ఉందని తెలిపారు. దేశంలో మూడు అక్రమ వ్యవసాయ చట్టాలను తీసుకురావడానికి కేంద్రం దొడ్డిదారిన యత్నిస్తోందని వ్యాఖ్యానించారు. ఇప్పుడు తీసుకువస్తున్న లోపభూయిష్ట విబి జి రామ్జి చట్టానికి వ్యతిరేకంగా పేదలు అంతా కలిసికట్టుగా ముందుకు రావల్సి ఉందని పిలుపు నిచ్చారు. రచనాత్మక్కాంగ్రెస్ ఆధ్వర్యంలో జాతీయ గ్రామీణ రోజ్గార్ ఉపాధి హామీ పథకం వర్కర్ల సదస్సులో ఖర్గే ఇతరులతో కలిసి రాహుల్ గురువారం మాట్లాడారు. పేదల మేలుకోసం ఇంతకు ముందు రోజ్గార్ యోజనను తీసుకువచ్చారు.
అయితే ఇప్పుడు దీనిని మార్చివేశారని విమర్శించారు. ఇంతకు ముందు తీసుకువచ్చిన నల్ల సాగు చట్టాలను రైతుల సంఘటిత పోరుతో వెనకకు తీసుకున్నారు. ఇప్పుడు ఏదో విధంగా వాటిని తిరిగి తీసుకువచ్చేందుకు యత్నిస్తున్నారని తెలిపారు. ఇప్పుడు కేంద్రం తీసుకువచ్చిన కొత్త ఉపాధి పథకంతో కేంద్రమే నిధులను ఖరారు చేస్తుంది. రాష్ట్రాలకు కేటాయిస్తుంది. ఇందులో అత్యధిక భాగం ఎప్పుడూ బిజెపి పాలిత రాష్ట్రాలకే చెందుతాయని విమర్శించారు. ప్రతిదీ రాజు వంటి ప్రధాని ద్వారానే జరగాలినేదే బిజెపి పాలనలో పావు అని రాహుల్ విమర్శించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో కాంగ్రెస్ పార్టీ తరఫున జాతీయ గ్రామీణ ఉపాధి పథకం విషయాన్ని ప్రస్తావిస్తుందని పార్టీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే తెలిపారు. మహాత్మా గాంధీ పేరు లేకుండా చేశారు. పేదలకు అన్యాయం చేస్తారని హెచ్చరించారు.




