
మన తెలంగాణ/హైదరాబాద్ః ఆరోగ్య భారత్‌గా చేయడమే ప్రధాని నరేంద్ర మోడీ లక్షమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. వారంలో ఒక్క రోజైనా ఆయిల్ వినియోగాన్ని తగ్గించాలన్న సంకల్పంతో ఆదివారం గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాటు చేసిన ‘సైకిల్ ఆన్ సండేస్’ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కొంత దూరం సైకిల్ నడిపించారు. అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రసంగిస్తూ ప్రజల జీవన విధానంలో వచ్చిన మార్పులు, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, వాతావరణంలో మార్పుల కారణంగా అనారోగ్యానికి ఇంకా ఒబెసిటికి గురవుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు.
ఒబెసిటి తగ్గించేందుకు ప్రధాని మోడీ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని ఆయన తెలిపారు. ఇందులో భాగంగానే ఆయిల్ వినియోగం తగ్గించాలని ప్రజలకు పిలుపునిచ్చారని ఆయన చెప్పారు. మానసిక వత్తిడి కూడా అనేక అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని అన్నారు. తమ చిన్న తనంలో మన పనులు మనమే చేసుకునే వాళ్ళమని, ఇప్పుడు పెరిగిన సాంకేతిక వల్ల పని భారం తగ్గడం కూడా అనారోగ్య సమస్యలకు కారణమవుతున్నదని ఆయన తెలిపారు.
అందుకే ఫిట్ ఇండియా ద్వారా ఆరోగ్య భారత్ కోసం ప్రధాని మోడీ కృషి చేస్తున్నారని ఆయన చెప్పారు. శక్తివంతమైన యువత దేశంలో ఉందనానరు. ఆ యువత ఆరోగ్యంగా ఉంటేనే ఆరోగ్య భారత్ నిర్మాణం జరుగుతుందని, అప్పుడే శక్తివంతమైన, ఆరోగ్యవంతమైన యువత దేశానికి సేవ చేసే అవకాశం కలుగుతుందని, దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఆరోగ్యవంతమైన యువత మేధస్సే దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.




