
దేశంలో మొట్టమొదటి వందేభారత్ స్లీపర్ రైలును హౌరాగువాహటి మధ్య ప్రధాని నరేంద్రమోడీ మాల్దా టౌన్ రైల్వేస్టేషన్ నుంచి శనివారం జెండా ఊపి ప్రారంభించారు. గువాహటిహౌరాకు తిరిగి వచ్చే వందేభారత్ స్లీపర్ రైలును కూడా వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించారు. దీంతో మొత్తం రూ. 3250 కోట్ల విలువైన అనేక రైలు, రోడ్డు రవాణా సౌకర్యాల ప్రాజెక్టులను పశ్చిమబెంగాల్‌లో ప్రారంభించారు. ఉత్తర బెంగాల్ మాల్దాలో బహిరంగ సభలో ప్రధాని మోడీ వర్చువల్‌గా నాలుగు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించారు. ఇవి న్యూజల్‌పాయ్‌గురినాగర్‌కోయిల్, తిరుచిరాపల్లి, అలిపుర్దూయార్ ఎస్‌ఎంవిటి బెంగళూరు, ముంబై (పాన్వెల్) రైలు సర్వీసులు. పూర్తి ఎయిర్ కండిషన్ స్లీపర్ ట్రైన్ వల్ల హౌరాగువాహటి మధ్య దాదాపు 2.5 గంటల ప్రయాణ సమయం తగ్గుతుంది. ప్రస్తుతం ఈ రూటులో ట్రైన్‌కు 18 గంటలు పడుతోంది.
అంతకు ముందు ఈ స్లీపర్ రైలులో ప్రయాణించే విద్యార్థులతో మోడీ ముచ్చటించారు. ఈ రైలు గంటకు 180 కిమీ గరిష్ఠ వేగంతో ప్రయాణిస్తుంది. దేశం మొత్తం మీద ప్రస్తుతం 150 వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయని, సమీప భవిష్యత్తులో దేశం అంతా ఈ వందేభారత్ రైళ్లు నడుస్తాయని మోడీ ఆశాభావం వెలిబుచ్చారు. పశ్చిమబెంగాల్‌లో శనివారం అదనంగా నాలుగు అమృత్‌భారత్ ఎక్స్‌ప్రెస్ టైన్లు ప్రారంభమయ్యాయని, ముఖ్యంగా ఈ రాష్ట్రం ఉత్తరబెంగాల్‌తో పశ్చిమ, దక్షిణ భారత్‌లు అనుసంధానింప బడ్డాయని చెప్పారు. ఎల్‌హెచ్‌బి కోచ్‌లతో ఉన్న రెండు కొత్త ట్రయిన్ సర్వీసులను కూడా మోడీ ప్రారంభించారు. ఈ రైళ్ల వల్ల ఐఐటి ప్రొఫెషనల్స్‌కు విద్యార్థులకు బెంగళూరుతో అనుసంధానం ఏర్పడింది. నేషనల్ హైవే 31 డి లోని ధూప్‌గురిఫలకట సెక్షన్ లో నాలుగు లైన్ల మార్గ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రాష్ట్రం లోని నాలుగు ప్రదాన రైల్వేప్రాజెక్టులకు మోడీ శంకుస్థాపన చేశారు. రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌మాట్లాడుతూ త్వరలో భారత దేశం వందేభారత్ రైళ్లను ఎగుమతి చేస్తుందన్నారు.




