
గత డిసెంబర్‌లో విమానాల రద్దు, ఆలస్యంతో వేలాదిమంది ప్రయాణికులను ఇక్కట్లు పాలు చేసిందన్న ప్రధాన కారణంపై ఇండిగో సంస్థకు డైరెక్టరేట్ జనరల్‌ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) రూ. 22.20 కోట్ల జరిమానా విధించింది. గత ఏడాది డిసెంబర్ 3 నుండి 5 మధ్య మూడు రోజుల్లో ఇండిగో 2507 విమానాలను రద్దు చేయగా, 1852 విమానాలు ఆలస్యంగా నడిచాయి. దీనివల్ల దేశ వ్యాప్తంగా విమానాశ్రయాల్లో 3 లక్షల మందికి పైగా ప్రయాణికులు చిక్కుకుపోయారు. దీనిపై జాయింట్ డెరెక్టర్ జనరల్ సంజయ్ కె. బ్రాహ్మణే నేతృత్వంలో నలుగురు సభ్యుల కమిటీ దర్యాప్తు చేసి గత ఏడాది డిసెంబర్ 27న సమర్పించిన నివేదిక ఆధారంగా డిజిసిఎ కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇంతేకాక డిజిసిఎ ఆదేశాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడానికి , దీర్ఘకాలిక వ్యవస్థాగత దిద్దుబాటుకు వీలుగా రూ. 50 కోట్లు బ్యాంకు గ్యారంటీ ఉంచాలని డిజిసిఎ ఇండిగో సంస్థను ఆదేశించింది. ఈ సందర్భంగా కేంద్ర పౌర విమానయానమంత్రి కె.రామ్మోహన్ నాయుడు ఈ పరిస్థితిని తాము సులువుగా తీసుకోవడం లేదని, దర్యాప్తు జరిపించి, కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు దీనిని ఒక ఉదాహరణగా తీసుకుంటున్నామని ప్రకటించారు.




