
అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈసారి సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ములుగు జిల్లా మేడారంలో జరుగనుంది. ఈ నెల 18వ తేదీన ఆదివారం సాయంత్రం 5 గంటలకు మేడారంలోని హరిత హోటల్ అందుకు వేదిక కానుంది. అయితే, సాధారణంగా సచివాలయంలో జరిగే కేబినెట్ సమావేశాన్ని ఈసారి గిరిజన ప్రాంతమైన మేడారంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సమావేశంలో ప్రధానంగా మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ఏర్పాట్లను పర్యవేక్షించడంతో పాటు, గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. అదే విధంగా రాష్ట్ర బడ్జెట్, మున్సిపల్ ఎన్నికలు, రైతు భరోసా వంటి కీలక అంశాలపై సమావేశంలో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ఈ కీలక భేటీకి సంబంధించి ఇప్పటికే డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, ప్రభుత్వ సలహాదారులకు సమాచారం అందింది. మంత్రివర్గ భేటీకి సంబంధించి ములుగు జిల్లా కలెక్టర్‌తో పాటు ఎస్పీలు తగిన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి.




