
సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి, థియేటర్లలో నవ్వుల వర్షం కురిపిస్తూ సంచలన విజయం దిశగా దూసుకుపోతున్న చిత్రం ‘అనగనగా ఒక రాజు’. స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్ పొలిశెట్టి కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని.. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. నూతన దర్శకుడు మారి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయిక. భారీ అంచనాలతో సంక్రాంతి కానుకగా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ’అనగనగా ఒక రాజు’ చిత్రం.. మొదటి ఆట నుంచే అద్భుతమైన స్పందనను సొంతం చేసుకుంది. కేవలం రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.41.2 కోట్ల భారీ వసూళ్లతో సంచలనం సృష్టించింది ఈ చిత్రం. ప్రేక్షకుల సంపూర్ణ మద్దతుతో బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురుస్తున్న నేపథ్యంలో.. తాజాగా చిత్ర బృందం థాంక్యూ మీట్ ని నిర్వహించి, ప్రేక్షకులకు కృతఙ్ఞతలు తెలిపింది. ఈ వేడుకలో స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్ పొలిశెట్టి మాట్లాడుతూ “అనగనగా ఒక రాజు చిత్రం బ్లాక్‌బస్టర్ కావడం మా అందరికీ ఆనందాన్ని కలిగించింది.
మా గురువు త్రివిక్రమ్, చినబాబు ఈ సినిమా విషయంలో మమ్మల్ని నమ్మి ఎంతగానో ప్రోత్సహించారు. మేము చెప్పింది నమ్మి ఏ ఎపిసోడ్లు అయితే సినిమాలో ఉంచడానికి వారు అంగీకరించారో.. ఇప్పుడు ఆ ఎపిసోడ్లకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఫస్ట్ హాఫ్‌లో మొదటి సన్నివేశం నుంచి ఇంటర్వెల్ వరకు ప్రేక్షకులు ఆగకుండా నవ్వుతున్నారు. సెకండ్ హాఫ్‌లో పొలిటికల్ ఎంటర్‌టైన్‌మెంట్ కి కూడా అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఇందులో వినోదంతో పాటు మంచి భావోద్వేగాలను కూడా అందించాము”అని అన్నారు.
నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ “ఈ సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు విడుదలైనప్పటికీ.. మా డిస్ట్రిబ్యూటర్లు అందరూ తగినన్ని థియేటర్లను మాకు కేటాయించి ఎంతో అండగా నిలిచారు. అందుకే రెండు రోజుల్లోనే రూ.41 కోట్ల గ్రాస్ రాబట్టగలిగింది ఈ చిత్రం”అని తెలిపారు. దర్శకుడు మారి మాట్లాడుతూ “చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఈ సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా చూసినవారు.. వాళ్ళ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్ కి ఈ సినిమా చూడమని చెబుతున్నారు”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కథానాయిక మీనాక్షి చౌదరి, రావు రమేష్, చిన్మయి, యువరాజు, గాంధీ, చంద్ర తదితరులు పాల్గొన్నారు.




