
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
మన తెలంగాణ/హైదరాబాద్: ఎన్నో ఏళ్లగా జర్నలిజం వృత్తిలో ఉండి నిబద్ధతతో పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి దొంతి రమేష్, పరిపూర్ణాచారి, సుధీర్‌లను అక్రమంగా పోలీసులు అరెస్టు చేయడాన్ని బీసీ సంక్షేమ సంఘం తీవ్రంగా ఖండిస్తుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఐఏఎస్ అధికారులను కించపరచారనే ఉద్దేశంతో రాత్రికి రాత్రే సమాజంలో గౌరవమైన స్థానంలో ఉన్న సీనియర్ జర్నలిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం చాలా దారుణమని అన్నారు. మహిళా ఐఏఎస్ అధికారులను వ్యక్తిగతంగా కించపరిచిన విధానాన్ని ఎవరు హర్షించరని, కానీ ఇదే సమయంలో ఎన్‌టీవీలో ప్రసారమైన వార్తకు వృత్తిలో భాగంగా పనిచేస్తున్న జర్నలిస్టులను కాదని, దానికి పూర్తి బాధ్యత యజమాన్యం, ఎడిటర్‌ల దేనని, జర్నలిస్టులది ఏమాత్రం కాదని ఇదే విషయం సిట్ తో దర్యాప్తు చేస్తున్న పోలీసులు గమనించాలన్నారు.
ఎన్టీవీలో ప్రసారమైన వార్తకు బాధ్యులుగా యజమాన్యంపై చర్య తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తొందరపాటు చర్యలకు పాల్పడకుండా బీసీ జర్నలిస్టులపై మోపిన అక్రమ కేసులను తక్షణమే ఎత్తివేయాలని, వారిపై ఇప్పటికైనా పోలీస్ విచారణ ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయ అధికారం కోసం, తమ ఆధిపత్యం కోసం జరిగే కొట్లాటలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ జర్నలిస్టులను బలి పశువులు చేయొద్దని, సమగ్రమైన దర్యాప్తు జరిపి బాధ్యులపైన మాత్రమే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అలా కాకుండా బీసీ జర్నలిస్టుల పైనే టార్గెట్ గా పనిచేయకూడదని జాజుల శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వానికి హితవు పలికారు. ఈ సమావేశంలో బొలిశెట్టి రంగారావు, బూర సోమేశ్వర్, మల్లయ్య యాదవ్, భాస్కర్, రాజు తదితరులు పాల్గొన్నారు.




