
మన తెలంగాణ/హైదరాబాద్: శారీరక ధృడత్వం, ఏకాగ్రత, సామాజిక భాగస్వామ్యం అనే వినూత్న కలయికతో ఈ ఆదివారం 18వ తేదీన జరగనున్న 57వ విడత ’ఫిట్ ఇండియా – సండేస్ ఆన్ సైకిల్’కు ఆతిథ్యం ఇచ్చేందుకు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియం వేదికగా నగరం సిద్ధమైంది. ఆధ్యాత్మిక, ఆరోగ్య సంరక్షణ విషయంలో ఈ కార్యక్రమానికి ఉన్న ప్రత్యేకతను తెలియజేస్తూ రంగారెడ్డి జిల్లా చేగూరు గ్రామ సమీపంలోని కన్హా శాంతి వనం ప్రాంగణంలో అంతర్జాతీయ ప్రధాన కార్యాలయం కలిగిన హార్ట్‌ఫుల్‌ల్నెస్ సంస్థ ఈ కార్యక్రమంతో జతకలిసింది. 2024 డిసెంబర్‌లో ‘ఫిట్ ఇండియా – సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమాన్ని కేంద్ర క్రీడా శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభించారు. ’ఫిట్ ఇండియా – సండేస్ ఆన్ సైకిల్’ ద్వారా శారీరక దృఢత్వం, స్వచ్ఛమైన వాతావరణం, సుస్థిరతను ప్రోత్సహించే ఒక ’ప్రజా ఉద్యమం’గా మారింది.
ఈ ఉద్యమంలో దేశవ్యాప్తంగా 2 లక్షలకు పైగా ప్రదేశాలలో 22 లక్షల కంటే ఎక్కువ మంది భాగస్వాములయ్యారు. ఈ సారి హైదరాబాద్ గచ్చిబౌలిలో జరిగే 57న విడత ‘ఫిట్ ఇండియా- సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమంలో భారత బ్యాడ్మింటన్ దిగ్గజం పుల్లెల గోపీచంద్, 2024 పారాలింపిక్ కాంస్య పతక విజేత- అర్జున అవార్డు గ్రహీత,- ప్రపంచ రికార్డు సాధించిన పారాలింపియన్ దీప్తి జీవంజి, ఇతర ప్రముఖులు పాల్గొననున్నారు. క్రీడల్లో రాణించేందుకు, రోజువారీ జీవితానికి శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, చురుకైన జీవనశైలికి సాధారణ పునాదులు అనే సందేశాన్ని వీరు బలపరచనున్నారు. ఇది సైక్లింగ్ ఉద్యమానికి పోటీతత్వ శక్తి, స్ఫూర్తిని అందిస్తుంది. ఫిట్ ఇండియా ఛాంపియన్లు, అంబాసిడర్లు కూడా సైక్లింగ్ మార్గ మధ్యలో ప్రజలతో కలిసి పాల్గొంటూ అన్ని వయసుల వారిని ఉత్తేజపరుస్తారు. సైక్లింగ్‌తో పాటు యోగా, జుంబా, టగ్-ఆఫ్-వార్, రోప్ స్కిప్పింగ్, ఇతర శారీరక కార్యకలాపాలు కూడా సమాంతరంగా జరగనున్నాయి.




