
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం ప్రకటించిన తాజా వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి టాప్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. కొంతకాలంగా వన్డేల్లో అసాధారణ బ్యాటింగ్‌ను కనబరుస్తున్న విరాట్ సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఇప్పటి వరకు అగ్రస్థానంలో కొనసాగిన భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తాజా ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి పడిపోయాడు. ప్రస్తుతం కోహ్లి 785 రేటింగ్ పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. కోహ్లి చివరి సారిగా 2021 జులైలో వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచాడు. టెస్టులు, టి20 ఫార్మాట్‌కు ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లి కేవలం వన్డేల్లో మాత్రమే ఆడుతున్నాడు.గత ఐదు ఇన్నింగ్స్‌లలో వరుసగా 50 కంటే ఎక్కువ పరుగులు సాధించాడు. ఓవరాల్‌గా 469 పరుగులు చేసి సత్తా చాటాడు.
ఈ క్రమంలో రెండు సెంచరీలు, మూడు అర్ధ సెంచరీలు బాదాడు. ఇక తొలి వన్డేలో విఫలమైన రోహిత్ శర్మ టాప్ ర్యాంక్‌ను కోల్పోయాడు. న్యూజిలాండ్ స్టార్ డారిల్ మిఛెల్ ఒక ర్యాంక్‌ను మెరుగు పరుచుకుని రెండో స్థానంలో నిలిచాడు. అఫ్గాన్ ఆటగాడు ఇబ్రహీం జద్రాన్ నాలుగో, భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఐదో ర్యాంక్‌లో కొనసాగుతున్నారు. శ్రేయస్ అయ్యర్ పదో, కెఎల్ రాహుల్ 11వ ర్యాంక్‌ను దక్కించుకున్నారు. కాగా, బౌలింగ్‌లో అఫ్గాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ టాప్ ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. ఇంగ్లండ్ స్పీడ్‌స్టర్ జోఫ్రా ఆర్చర్ రెండో, భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మూడో ర్యాంక్‌లో కొనసాగుతున్నారు. మరోవైపు వన్డే టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. 122 రేటింగ్ పాయింట్లతో టీమిండియా టాప్ ర్యాంక్‌లో కొనసాగుతోంది. న్యూజిలాండ్ రెండో, ఆస్ట్రేలియా మూడో ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాయి.




