
న్యూయార్క్ : తాను ఇప్పుడు వెనెజువెలా తాత్కాలిక కార్యనిర్వాహక అధ్యక్షుడిని అని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించుకున్నారు. నికోలాస్ మదురోను బందీ చేసి అమెరికాకు తరలించిన తరువాత వెనెజువెలాలో నాయకత్వ లోపం తలెత్తి ఉంది. ఈ దశలో అత్యంత అసాధారణ రీతిలో ఒక దేశ నేత హోదాలో ఉన్న ట్రంప్ వేరే దేశానికి యాక్టింగ్ ప్రెసిడెంట్ హోదాను తమ ట్రూత్ సోషల్ మీడియా ద్వారా వెలువరించారు. ట్రంప్ ది యాక్టింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ వెనెజువెలా అని తనను తాను తెలియచేసుకున్నారు. సోషల్ మీడియాలో ట్రంప్ అధికారిక చిత్రం కింద ఇంతకు ముందటి వరకూ కేవలం అమెరికా ప్రెసిడెంట్ అనే గుర్తింపు ఉండేది. ఇప్పుడు ఇది మారింది.
అమెరికా 45వ, 47వ ప్రెసిడెంట్ తో పాటు తన హోదాకు వెనెజువెలా యాక్టింగ్ ప్రెసిడెంట్ పదవిని కూడా జతచేసుకున్నారు. వెనెజువెలాలో సరైన రీతిలో, న్యాయపరమైన అధికార మార్పిడి జరిగే వరకూ అక్కడి పాలనాపగ్గాలు అన్ని కూడా అమెరికా చేతుల్లో ఉంటాయని ట్రంప్ ప్రకటించారు. వెనిజులియన్ల ప్రయోజనాలను పట్టించుకోని వారికి అక్కడి బాధ్యతలు అప్పగించడం కుదరదని, తాము ఛాన్స్ తీసుకోదల్చుకోలేదని ట్రంప్ స్పష్టం చేశారు. ఇక వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షులుగా గత వారం బాధ్యతలు తీసుకున్న దేశ ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగూజ్ పరిస్థితి ఇప్పుడు ఏమిటనేది ప్రశ్నార్థకం అయింది. వెనెజువెలా చమురు నిల్వలను అమెరికానే వినియోగించుకుంటుందని ట్రంప్ చెపుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే అక్కడి అత్యంత నాణ్యమైన , తమకు చెందాల్సిన 30 నుంచి 50 మిలియన్ బారెల్స్ చమురు అమెరికాకు చేరుతోంది, దీనిని మార్కెట్ ధరలకు అనుగుణంగా విక్రయించి, సొమ్మును అమెరికా ఖజానాకు చేర్చడం జరుగుతుందని ట్రంప్ ప్రకటించారు.




