
స్పందించని ఇరాన్
టెహ్రాన్‌లో ఖమేనీ మద్దతు ర్యాలీలు
హింసకు దిగితే మరణశిక్షలు
పాలక పక్షం ఘాటు హెచ్చరికలు
దుబాయ్: ఇరాన్ పాలకులు ఇప్పుడు తమతో చర్చలకు సిద్ధపడుతున్నారని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఇరాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక ఘర్షణలు తీవ్రస్థాయికి చెందాయి. సంబంధిత ఘటనల్లో మృతుల సంఖ్య ఇప్పుడు కనీసం 544 కి చేరింది. అణచివేతలకు ప్రతిగా తాము ఇరాన్‌పై దాడికి హెచ్చరించిన తరువాత ఫలితం కనబడుతోంది. చర్చలకు దిగివస్తున్నారని ట్రంప్ చెప్పినట్లు దుబాయ్ నుంచి వార్త వెలువడింది. అయితే ట్రంప్ ప్రకటనపై ఇరాన్ నుంచి ఎటువంటి స్పందన వెలువడలేదు. ఇరాన్, అమెరికా మధ్య ఘర్షణ నివారణకు ఒమన్ ముందుకు వచ్చింది. ఇటీవల ఈ దేశ విదేశాంగ మంత్రి ఇరాన్‌కు వెళ్లి వచ్చారు. టెహ్రాన్, వాషింగ్టన్ నడుమ ఒమన్ మధ్యవర్తిత్వం కీలక దశకు చేరిన సమయంలోనే ట్రంప్ ప్రకటన వెలువడింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి సోమవారం టెహ్రాన్‌లోమీడియాతో మాట్లాడారు.
ట్రంప్ మాటలపై స్పందించలేదు. అయితే ఇప్పుడు ఇరాన్‌లో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిందని వివరించారు. ఇజ్రాయెల్ , అమెరికాల కవ్వింపు చర్యల వల్లనే హింసాకాంవ చెలరేగిందని మండిపడ్డారు. అమెరికా ప్రెసిడెంట్ రెచ్చగొట్టే మాటలతోనే ఇరాన్‌లో ఘర్షణలు జరిగాయని , ఈ నెత్తుటి బాధ్యత ట్రంప్‌దే అని తెలిపారు. ట్రంప్ చెప్పిన విషయంపై ఇరాన్ మంత్రి స్పందించలేదు. కానీ తమకు దౌత్యం పట్ల నమ్మకం ఉందన్నారు. సోమవారం ఇరాన్‌లో లక్షలాది మంది ప్రభుత్వ అనుకూల ప్రజలతో భారీ స్థాయిలో ప్రదర్శనలు జరిగాయి. ఇరాన్ మత ప్రాతిపదిక , దైవత్వ పాలన విధానం పట్ల మద్దతుగా నినాదాలతో ర్యాలీలు జరిగాయి.
అంతకు ముందు రోజు వరకూ సాగిన తీవ్రస్థాయి ఖమేనీ వ్యతిరేక ప్రదర్శనలకు ఇవి పోటీ ప్రదర్శనలుగా మారాయి. వీధులలో ప్రదర్శనకారులు దైవ శత్రువులకు చావు తప్పదని నినదించారు. ఖమేనీ వ్యతిరేక నిరసనకారులపై విచారణలు తీవ్రతరం అవుతాయని, ఘటనలను బట్టి కొందరికి మరణశిక్షలు కూడా అమలు చేస్తారని ఇరాన్ అటార్నీ జనరల్ హెచ్చరించారు. పోటాపోటీ ప్రదర్శనలతో టెహ్రాన్‌లో జనం భయాందోళనకు గురి అయ్యారు. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొనడంతో పౌరులు ఎక్కువగా వీధుల్లోకి రాకుండా ఉంటున్నారు. దీనితో సూర్యాస్తమయం తరువాత వీధులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. నగరంలో ఉగ్రవాద శక్తులు హింసాకాండకు దిగుతున్నాయని, పౌరులు జాగ్రత్తగా ఉండాలని అదికారులు మైక్‌ల్లో హెచ్చరిస్తున్నారు.




